పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

శ్రీ త్రికోటీశ్వరాలయముు

ఇందలి శాసనాదులను బట్టి 11వ శతాబ్దమునాఁటికే యీ గుడి యున్నట్లు స్పష్టము. కాని యొక్క కథమాత్రము చెప్పుదురు. గురవయ్యపాలెం కాపురస్థులు గ్రంథెవారను వైళ్యు లీ కొండపైకి కలపకొఱకు వెళ్ళఁగా హఠాత్తుగా పెద్దవాన గురిసి యొక సెలయేటిగుండ లంకెబిందెలు కొట్టుకొని వచ్చినట్లును, వారి కారాత్రి కలలో కోటీశ్వరుడు యోగివలె నగపడి తనకు గుడి కట్టించుమని చెప్పఁగా వారట్లొనర్చి రనియు పరంపరగాఁ జెప్పుదురు. దీని కెట్టియాధారములు గానరావు. ఇందుఁగల సాలంకయ్య యను భక్తుని చరిత్రమే యిట్లు చెప్పిరేమో: విమర్శనీయము, క్రమముగా నా గుడిని కొందఱు భక్తు లొక్కొక్కభాగము కట్టించుచు వచ్చిరి. అందు ముఖ్యులు మాదల శంభులింగమ్మ, సిద్ధుమల్లప్ప, మన గ్రంథకర్త నరసింగయ్య, తిరుమలరాజు మొదలగువారెందఱో గలరు. 'ఎండోమెంటుబోర్డు' వారి పరిపాలనకు వచ్చిననాఁటినుండి దేవాలయము సర్వవిధముల సుచ్చదశలోనికి వచ్చినది. ప్రజలకు వలయు సౌకర్యము లెన్నఁదగినవిగ నున్నవనవచ్చును..


ఇతర దేవాలయములు :

కోటీశ్వరుని గుడికి దక్షిణమున గణనాథాలయము గలదు. పశ్చిమమున, నుత్తరమున సాలంకేశ్వర సంతాన కోటీశ్వర లింగములు గలవు. ఎడమవై వున దొనయొద్ద మార్కండేయ లింగము గలదు.. దిగువ మెట్లవరుసప్రక్కను రామలింగేశ్వర లింగము గలదు. సోపానమార్గమున గొల్లభామ గుడి యున్నది.

సోపానమార్గమున ముందుగ బొచ్చుకోటీశ్వరునిగుడి గలదు. ఇందు మ్రొక్కుబడులవారు కేశఖండనము చేయించుకొందురు.


ఇంక కొండక్రింద ప్రపన్న కోటీశ్వరుడు, వీలకంఠేశ్వరస్వామి మొదలగు పేరు గల గుళ్ళు పెక్కులు గలవు.


ఇచ్చట 'ఓంకారనది' ఓగేరు అను పేరుతో చేజెర్లలోని కపోతేశ్వరుని గుడిప్రక్కనుండి ప్రవహించి యీ కొండకు సమీపముగా వెడలి సముద్రమున గలియుచున్నది. మఱియు శ్రీ త్రికోటీశ్వరస్వామి కర్పించిన భూముల వై నమును, కోనేళ్ళు, బావులు, సత్రములు వానికి సంబంధించిన శాసనముల వివరములును కీ. శే. మద్దులపల్లి గురుబ్రహ్మముగారి త్రికోటీశ్వర చరిత్రము (వచనము) నఁ దెలియనగును.