Jump to content

పుట:శృంగారమంజరి- తాళ్లపాక అన్నమాచార్యులు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శృంగార మంజరి.

11

కొంచదు[1] ప్రాణంబు గుఱుతుగాఁజేసి|యెంచదు వీణె వాయించదు పరిణ|
మించదు మది సంభ్రమించదు చెలియ|కించుకేనియును సయించదు[2] కాని|
కప్పదు చనుదోయి కనుఁ గ్రేవఱెప్ప|విప్పదు తనప్రాణవిభుమీఁదిమనసు|
త్రిప్పదు మదిలోన [3]దీకొన్నప్రేమ|చెప్ప దెవ్వరితోడఁ జెప్పునోకాని|
పెట్టదు కస్తూరి పేర్కొని[4] చేతఁ|బట్టదు సేవంతిబంతి నెత్తమ్మిన|
ముట్టదు సిగ్గుల మొద లించుకైనఁ|బుట్టదు తలఁ పెందుఁ బుట్టునోకాని|
తాపంబు[5] మేనఁ బ్రతాపింపఁ దొడఁగె|నూర్పులు మిగుల నిట్టూర్పులై నిగుడెఁ|
బగలెమృగాక్షికి[6] వగలుగాఁ[7] జొచ్చె|రాత్రులింతికి శివరాత్రులై[8] తోఁచె|
శిశిరో[9]పచారవిశేషభావనలు|సేయంగవలె నని చెలులెల్లఁ గూడి|
పైకొని యేప్రొద్దుఁ బన్నీరువారిఁ[10]|బూచిన [11]గొజ్జంగపొదరింటిలోను|
బద్మాక్షిఁ జల్లనిపాన్పుననునిచి|[12]యొడఁగూర్పఁదొడఁగిన నుపచారవిధులు[13]|
పలుమాఱు [14]విపరీతభావంబులైన|[15]ముగ్ధలు తమలోన మోములు చూచి|
యంతంత నొకరొక రచనలు చేసి|యీవేళఁ దడ వేల [16]హేలావిశాల|
శశికాంతమణికాంత సౌధాంతరములఁ[17]|జలువలనెలవులఁ[18] జంద్రాస్య నునిచి|
గుప్పుఁడు పుప్పొళ్లు కుచములమీఁదఁ|గప్పుఁడు చెంగావి కప్రంపుబడిమి[19]|
త్రిప్పుఁడు చెలులెల్లఁ దిరిగిరానుండఁ|జెప్పుఁడు మనవులఁ జెప్పెడి దేమి|
చిలుకుఁడు పూఁదేనె చెలిమేన నిండ|నలుకుఁడు శ్రీగంధ[20] మప్పటప్పటికిఁ|
గులుకుఁడు[21] పన్నీరు కోమలితోడఁ|బలుకుఁడు పలుమాఱుఁ బలుకరింపుచును|
బాయుఁడు నునుగాలి పైకొననిండు|ద్రోయుఁడు [22]సొబగైనతొలువిరులెల్ల[23]|
వేయుఁడు కమ్మఁగ్రొవ్విరులు పైపైని|సేయుఁ డింతటిలోన [24]శీతలక్రియలు|
అనుచు శైత్యోపచారాదులు[25] సేయ|నల్లనల్లన తాప [26]మగ్గలం బైన|


  1. కొంచదు=సంకోచింపదు
  2. సయించదు=ఓర్చుకొనదు
  3. దీకొన్న= ఎదిరించిన
  4. పేర్కొని = పేరు చెప్పి
  5. తాపము=బాధ
  6. మృగాక్షి=లేడికన్నులవంటి కన్నులుగలది
  7. వగ=దుఃఖము; పగలు= విరోధము
  8. శివరాత్రులు=జాగరణపు రాత్రులు
  9. శిశిర= చల్లని
  10. వారి=నీళ్లు
  11. గొజ్జంగ = ఒకానొకపూఁజెట్టు
  12. ఒడఁగూర్ప= సేయుటకు
  13. విధులు= రీతులు
  14. విపరీత= వ్యతిరేకమైన
  15. ముగ్ధలు=ఉదయించిన యౌవముగలవారు
  16. హేల= కనుబొమ్మలు మొదలగు వానిచేఁదెలియఁజేయఁదగినమనోవికారము
  17. ఆంతరములు=మధ్య భాగములు
  18. నెలవులు=చోట్లు
  19. బడిమి= భూతబలి
  20. శ్రీగంధము= చందనము
  21. కులుకుఁడు=చిలుకరిఁపుండు
  22. సొబగు=అందము
  23. తోలువిరులు=ప్రాతపూలు
  24. శీతల=చల్లనగు
  25. ఉపచారములం=సేవలు
  26. అగ్గలము= అధికము