10
శృంగార మంజరి.
గ్రాఁగినమతి నొప్పి కనుఁగ్రేవ డప్పి[1]|చెలికత్తెమూఁపుపైఁ జేర్చినచేయి|
యల్లార్చి ఱెప్ప వేయనికన్నుదోయి|తనమేనిఁ జెలి దండ దాఁచినబాగు|
నంతలో మైమఱ పైయున్నలాగు|కనుఁగొని చెలులెల్లఁ గడు వెఱఁగంది|
యలరినవేడ్కల నబ్జాక్షిఁ జూచెఁ|జూచినయంతన సూనాస్త్రగురుఁడు[2]|
జూపులు తూఁపులై[3] సోఁకె నొండొరులఁ|దనరాజ్యలక్షణోత్తర[4] మైన తన్విఁ|
గప్పంబుగా నిచ్చెఁ [5]గందర్పుఁ డనఁగ|గంభీరనాయకుఁ గాంచెనో యనఁగఁ|
దీపులవిలునారితిండి [6]మోపెట్టి|పూవుఁదూపులయంపపొది[7] వెంటఁగట్టిన
చిన్నారివిరిదమ్మిచిలుకుఁ[8] జేఁబట్టి|యల్లన పొడచూపె నారతిరాజు|
ఈయింతితో విభుఁ డింపొందు ననుచుఁ|[9]నేపునఁ గీరంబు లేచి[10] పై రొప్పె[11]|
నీకొమ్మ మదికోర్కులీడేఱు[12] ననుచుఁ|జాలిచేరువఁదీర్చె[13] జక్కవదోయి[14]|
తరలాక్షి మదిలోన [15]దరికొన్న విరహ|మాఱెడువీపుగా పనెడుచందమున|
నుబ్బునఁ బైవీఁచె [16]నొయ్యనిగాలి|[17]కమలామనోనాథు కరుణాకటాక్ష[18]|
వీక్షణం బతివపై [19]వెల్లిగొన్నట్లు|పరిపూర్ణచంద్రికాప్రభలు పైఁ బర్వఁ|
గడిమి [20]నుద్దీపనకారణం బగుచు|లావుగా మరునిబలం బెల్ల నొదరఁ[21]|
గడు నింపులై యుండఁ [22]గారింపు లౌను|నెలమిఁ గారింపులేయింపులై యుండుఁ|
బ్రియములైనవియె యప్రియములైయుండు|నప్రియంబులె ప్రియంబై యుండుఁ జూడ|
నాలోనఁ జెలులెల్ల నాలోలనేత్రఁ|బరికించి విరహతాపస్ఫూర్తి[23] దెలిసి|
యీరామపోరాము[24] లేమిట మాను|నీకాంతవలవంత[25] లేవంకఁ దీరుఁ|
జూడదు తలయెత్తి శ్రుతి దండెఁ[26] గూర్చి|పాడదు చెలులెల్లఁ బైకొన్న సరస|
మాడదు చిలుకతో నందంపుమాట|లాడదు [27]వెడమాఁట లాడెడిఁగాని|
- ↑ డప్పి=ఆన
- ↑ సూనాస్త్ర గురుఁడు = విష్ణువు
- ↑ తూఁపులు =బాణములు
- ↑ ఉత్తర =మీఁదిది
- ↑ కందర్పుఁడు=మన్మథుఁడు
- ↑ మోపెట్టి =కూర్చి
- ↑ అంపపొది= అమ్ములు పెట్టు సంచి=తూణీరము
- ↑ చిలుకు= బాణము
- ↑ ఏపు= గర్వము
- ↑ ఏచి=రేఁగి
- ↑ రొప్పె=కవిసె
- ↑ ఈడేఱు =సిద్ధించు
- ↑ తీర్చె=శకునమిచ్చె
- ↑ జక్కపదోయి= చక్రవాకములజంట
- ↑ దరి కొను=మండు
- ↑ ఒయ్యని= మృదువైన
- ↑ కమల= లక్ష్మి
- ↑ కటాక్ష= కడఁగంటి
- ↑ వెళ్లి=ప్రవాహము
- ↑ ఉద్దీపన= అధికము చేయు
- ↑ ఒదర= కూయఁగా
- ↑ కారింపులు=బాధలు
- ↑ స్ఫూర్తి=వ్యక్తముగా స్ఫురించుట
- ↑ పోరాములు=సంకటములు
- ↑ వలసంతలు=మన్మథవ్యథలు
- ↑ దండె= వీణెలో
- ↑ వెడ= వికారమైన