శ్రీ
శృంగార మంజరి.
(అ.చా)
శ్రీమతే రామానుజాయ నమః
తాళ్లపాక యన్నమాచార్యులు తిరువేంగళనాథ దేవునికి
విన్నపము చేసిన శృంగార మంజరి.
శ్రీకామినీవక్షు జితహిరణ్యాక్షు[1] | భువనపాలనదక్షుఁ[2]బుండరీకాక్షు |
వివిధగీర్వాణాద్యు[3] వేదాంతవేద్యుఁ | బరమతత్త్వాపాద్యు[4] [5]భవరోగవైద్యు |
శోభితగుణధాము[6]సురసార్వభౌము | మౌనిమానసహంసు [7]మథితోగ్రకంసు |
శేషాహివరతల్పు సిద్ధసంకల్పు | [8]నీలోత్పలవ్యూహ నీలాంబువాహ |
నీలాద్రిసంకాశు[9] [10]నిబిడప్రకాశు | నిర్మలతరదేహు [11]నిగమాంతగేహు |
గోపాంగనాకుంభకుచశాతకుంభ[12] | కుంభకుంకుమ [13] చారుగురుతరాకారు |
వేణునాదామోదు[14]విహితప్రసాదు | నవ్యక్తు[15]నతవేద్యునాద్యునద్వంద్వు[16]
నధ్యాత్మునచ్యుతు[17]నాద్యంతరహితు | నిర్గుణు[18]నిఖిలాండనిర్మాణనిపుణు |
నిర్వాణు నిర్మలు నిత్యు నిశ్చింతు | సర్వజ్ఞు సాకారు సచ్చిదానందు | సర్వతోముఖరూపు[19] సత్యస్వరూపు |
నఖిలహిరణ్యగర్భాండనాయకుని | వివిధలోకాధీశు వేంకటాద్రీశు | నధిక తేజోమూర్తి [20]నలరెడువాని|
గంగానదీజన్మకారణం బనఁగ | బొగడొందు తనపదాంభోజముల్ [21]సూపి |
యింపొందవైకుంఠమిదియసుమ్మనుచు | సొంపొందవలకేలఁ[22]జూపెడువాని |
ఘనదైత్యగర్వాంధకారంబు[23] లెల్ల | మానుప దేదీప్యమానమై[24] వెలుఁగు |
- ↑ జితహిరణ్యాక్షున్= జయింపబఁడిన హిరణ్యాక్షునిఁ గలవానిని
- ↑ దక్షున్=సమర్థుని
- ↑ ఆద్యున్=మొదటివానిని
- ↑ తత్త్వాపాద్యున్=ఆత్యజ్ఞానముచే పొందఁదగిన వానిని
- ↑ భవ=సంసారము
- ↑ ధామున్=ఇల్లయినవానిని
- ↑ మథిత=త్రచ్చఁబడిన
- ↑ నీలోత్పలము=నల్లకలువ
- ↑ సంకాశు=సమానమైనవాని
- ↑ నిబిడ=దట్టమైన
- ↑ నిగమాంతము=వేదాంతము
- ↑ శాతకుంభ=బంగారముతోచేయఁబడిన
- ↑ చారు=రమ్యమైన
- ↑ ఆమోదము=సంతోషము
- ↑ అవ్యక్తున్=తెలియఁబడినవానిని
- ↑ అద్వంద్వున్=ఒకఁడేయైనవానిని
- ↑ అచ్యుతున్=నాశనములేనివానిని
- ↑ నిఖిలాండము=సర్వబ్రహ్మాండము
- ↑ సర్వతోముఖరూపున్=బ్రహ్మస్వరూపము గల వానిని
- ↑ అలరేడు= ఒప్పెడు
- ↑ పదాంభోజము=అడుగుఁదామర
- ↑ వలకేలన్=కుడిచేతిలో
- ↑ గర్వాంధకారము=పొగరనెడు చీకటి
- ↑ దేదీప్యమానము=మిక్కిలి ప్రకాశించునది