పుట:శృంగారనైషధము (1951).pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

శృంగారనైషధము


బలికిన ప్రయోజనంబు సాధింతు, లోకాలోకపర్యంతం బైనథాత్రీమండలంబునందు నీ వెయ్యది యపేక్షించితి వప్పదార్థంబు గొని వచ్చి నీకు సమర్పింపంజాలుదుఁ, గందర్పాకారు లైనరాకుమారు లెల్లరు నాకు వశవర్తులై యుండుదురు, విశేషించి యన్నిషధభూవల్లభుండు నన్నుం మన్నించి యుండు.

65


సీ.

అతఁడు పాణిగ్రహణార్హుండు విను నీకు
        నతనిఁ గూర్పఁగ నేర్తు నతివ! యేను
పిన్నపాపపు నీవు పితృపరాధీనవు
        కార్యనిర్ణయశక్తి గలదె నీకు?
నావల నిషధరా జఖిలలోకేశ్వరుం
        డీవలఁ బరమేష్ఠిహితుఁడ నేను
సందేహడోలాధిశాయి యైనప్రసంగ
        మిప్పట్టునందు నే నెట్లొనర్తు?


తే.

[1]మొదల సంఘటియించినఁ బొంది కార్య
మవల విఘటించె నేని గౌరవము దప్పి
ప్రాణమై నన్ను రమ్ము పొమ్మను నృపాలు
నెదురఁ దల వంచికొనియుండ నెట్లు నేర్తు?

66


ఉ.

ఇప్పటినీతలంపు తెఱఁ గిట్టిద యౌ నిటమీఁద నెప్పుడే
చొప్పున నుండునో నిజము సుద్ది యెఱుంగము గాని యుగ్మలీ!

  1. తే. ‘మొదల సంఘటియించినపొందు పిదప, కార్య మఘటించెనేనియు ఘనతదప్పి’ అనియు, ‘మొదల సంఘటించినఁ బొంది పిదపనున్న, కార్య మఘటించె నేనియు ఘనత దప్పి’ అనియుఁ బాఠాంతరములు.