Jump to content

పుట:శృంగారనైషధము (1951).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

శృంగారనైషధము


సూత్రంబునం గట్టఁ బాత్రంబుగాని తెఱంగున నిషధరాజుదక్క వేఱొక్కండు నిన్ను వరియింపం బాత్రుండు గాఁడు. మఱియు నొక్కవిశేషంబు.

57


చ.

అడిగితి నొక్కనాఁడు గమలాసనుతేరికి వారువంబనై
నడుచుచు 'నుర్విలో నిషధనాథుని కెవ్వతె యొక్కొ భార్య య
య్యెడు?' నని చక్రఘోషమున నించుకయించుక గానియంత యే
ర్పడ [1]వినఁ గాని నీ వనుచుఁ బల్కినచందము దోఁచె మానినీ!

58


ఉ.

నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి యెల్లి నేఁటిలోఁ
దూర్ణము సేయఁగాఁ గలఁడు తోయజసూతి, తదన్యథా వృథా
దుర్ణయవృత్తికిన్ మనసు దూర్చిన నేని జగజ్జనాపవా
దార్ణవ ముత్తరించుటకు నాతని కెయ్యది దెప్ప చెప్పుమా?

59


వ.

అనిన విని ముహూర్తమాత్రంబు చింతించి యాయింతి శకుంతవల్లభున కిట్లనియె.

60


తే.

బాల్యమునఁ జేసి యేను జాపలముఁ బూని
నిన్ను నాయాసపెట్టితి నిగ్రహమునఁ
దప్పుఁ జేసితి లోఁగొమ్ము దయ దలిర్ప
బ్రహ్మవాహనకులముఖ్య! పక్షిరాజ!

61


సీ.

దర్శనీయంబు నీతనువిలాసం బెప్డు
        నీమనం బత్యంతనిర్మలంబు
మధురాక్షరములు నీమహితభాషణములు
        కీర్తనీయంబు నీవర్తనంబు

  1. విననైతి