పుట:శృంగారనైషధము (1951).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

శ్రీనాథుఁడు

ఆంధ్రవాఙ్మయమునఁ దిక్కనతరువాత నింతపండితుఁడు మఱొకఁడులేఁడు. తిక్కనవలెనే యీతఁడును గురుపీఠమలంకరించిన మహామూర్తి. సోమయాజివలెనే యీకవిసార్వభౌముఁడును రాజభోగములన్నిటిని ననుభవించిన పుణ్యశాలి. ఇతఁడు తనసమకాలముననేగాక మొన్నమొన్నటివఱకును గూడ, నీభాషపయిఁ దనప్రభావము నెఱపిన శక్తిమంతుఁడు; విపులకావ్యేతిహాసములనుండి యాంధ్రరసికులదృష్టిని బ్రబంధములవైపు మరలించిన రసికావతంసుఁడు.

శ్రీనాథునిఁగూర్చి యెఱిఁగినంతపూర్ణముగ మనకితరకవులఁ గూర్చి తెలియదు. శ్రీనాథుఁడు చిన్నతనముననే సమస్తవేదవేదాంగపాండిత్యమును సంపాదించెను; సాంఖ్యాదిసిద్దాంతములను, శైవవైష్ణవాగమములను, పాతంజలాదియోగసూత్రములను, న్యాయవైశేషికాదిదర్శనములను గబళించెను. ఈసమస్తవిద్యాపరిశ్రమ మాతనిగ్రంథములయందుఁ గానవచ్చును. సంస్కృతకవిప్రపంచమునఁ గాళిదాసభారవిమురారిశ్రీహర్షు లతనికి గురుస్థానము. ఆంధ్రకవులందుఁ గవిత్రయమువారియెడను భీమకవియెడను నీతనిది కేవలము శిష్యభావము. (చూ. వచియింతు వేములవాడభీమనభంగీత్యాది.) పాల్కురికి సోమనయెడసైతమీతనికి గౌరవములేకపోలేదు. ఏలన నితఁడతని ద్విపదకావ్యమైన పండితారాధ్యచరిత్రమును బద్యకావ్యముగ సంతరించి మామిడిప్రెగ్గడయ్యకుఁ గృతి నొసంగెను. సోమనాథునికావ్యమును గేవలము చదివి పరి