పుట:శృంగారనైషధము (1951).pdf/325

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

శృంగారనైషధము


రాజబింబనిభాస్య! కారణగుణంబు
గార్యమున సంక్రమించుట గలద కాదె?

175


తే.

వహ్ని మొదలై యఖిలదైవతగణంబు
దృప్తిఁ బొందుదు రీసుధాదీప్తియందు
మహితపుణ్యాత్ముకళ్యాణగృహమునందుఁ
బొలఁతి! యభ్యాగతులు దృప్తిఁబొందునట్లు.

176


తే.

ప్రవహవాయుకురంగ మంబరమునందు
డప్పిగొని యీసుధాంశుమండలము సొచ్చి
యమృతపంకంబులో నంఘ్రు లణఁగుటయును
వెడలలేకున్న యదిచూడు విద్రుమోష్ఠి!

177


సీ.

ఓషధీసందేశభాషాప్రణిధి యైన
        మృగము గాఁబోలు నీ మృగము దరుణి!
రుద్రాగ్రహత్రాసవిద్రావితం బైన
        మృగము గాఁబోలు నీ మృగము దరుణి!
ప్రవహనామకమహాపవనవాహన మైన
        మృగము గాఁబోలు నీమృగము దరుణి!
రోహిణీశుద్ధాంతగేహవర్ధిత మైన
        మృగము గాఁబోలు నీమృగము దరుణి!


తే.

 సతతసేవాసమాయాతసకలభువన
భవ్యవిపినౌషధీలతాపల్లవాగ్ర
భక్షణక్షీబ మై సుధాపాయి యగుచు
మగువ! యీచంద్రునందు నీమృగము బ్రతికె.

178