పుట:శృంగారనైషధము (1951).pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

శృంగారనైషధము


తే.

ధర్మబీజవియన్నదీతాతపాద!
కామితార్థప్రదైనైక కల్పవృక్ష!
కామజనక! చిదాత్మప్రకాశరూప!
కమలనాభ! చతుర్వర్గగతివి నీవ.

147


తే.

విశ్వరూప భవద్భూరివిభవమహిమ
యెంత వర్ణింపఁ జాలు మాయీమనంబు?
ప్రాఁతపైచీరచెఱఁగున బడుగువాఁడు
హేమశైలంబు చిదిపి ఱా లెన్ని ముడుచు!

148


వ.

అని యనేకప్రకారంబులం బ్రస్తుతించి నమస్కరించె, నివ్విధంబున దేవతార్చనం బొనర్చి భోజనకార్యంబులు దీర్చి విజితవైజయంతం బగుశుద్ధాంతకేళీసౌధం బెక్కి విహితకులదేవతాభక్తియుం గృతభుక్తియు నగుదమయంతీమహాదేవితోడం గూడె ననంతరంబ.

149


సంగీతాదిగోష్టి

శా.

ఆరామారమణుల్ రమాసతియు దైత్యారాతియుంబోలె శృం
గారక్రీడలఁ బొద్దు పుచ్చిరి వధూగంధర్వకన్యాకళా
కీరాలాపకలాపకోకిలకుహూకేళీమయూరాంగనా
చారీమండలతాండవారభటికాసంరంభసంభావనన్.

150


సాయంసంధ్యావర్ణనము

వ.

అంత.

51


తే.

గగనహరినీలశైలశృంగమున నుండి
డొల్లిపడెఁ బ్రొద్దు జేగురుఁ గల్లువోలెఁ
చన్ని పాతసముద్ధూతధాతుధూళి
చందమునఁ దోచె దివసావసానసంధ్య.

152