పుట:శృంగారనైషధము (1951).pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

శృంగారనైషధము


జయ పూర్వగీర్వాణసంహారకారణ!
        జయ కుక్షినిహితవిశ్వప్రపంచ!
జయ జహ్నుకన్యకాజనకపాదాంభోజ!
        జయ కోమలాంబుదశ్యామలాంగ!
జయ వైజయంతికాస్రక్ప్రభాలంకార!
        జయ పుండరీకవిశాలనయన!


తే.

జయ శతక్రతుముఖమరుచ్చక్రవాళ
కనకకోటీరచారుసంఘటితనూత్న
రత్ననీరాజనక్రియారాజమాన
చరణపీఠాంతికోద్దేశ! జయ రమేశ?

117


క.

భవదీయము లగుమంత్రము
లవాఙ్మనసగోచరంబు లంభోరుహసం
భవభవుల కనిన శక్యం
బవునే మాబోటివారి కచ్యుత! పొగడన్?

118


శా.

ఓదామోదర! యిందిరాయువతివిద్యుల్లేఖతో నూత్నపిం
ఛాదామత్రిదశేంద్రకార్ముకముతో సమ్యక్కృపాదృష్టితో
నీ దేహం బనుమేచకాంబుదము మన్నేత్రద్వయీచాతకా
హ్లాదంబుం బొనరించుఁగాత భవతాపాటోపముం బాపుచున్.

119

భగవద్దశావతారవర్ణనము

తే.

కపటమత్స్యంబ వై నీవు గడలి నడుమఁ
బుచ్ఛ మల్లార్ప నెగసినభూరిజలము
మింటఁ గడుఁ దెల్లనై పాఱుచుంటఁ జూచి
యభ్రనది యంచు వర్ణించె నఖిలజగము.

120