పుట:శృంగారనైషధము (1951).pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

శృంగారనైషధము


యన్యపురుషుఁడు గాఁడె పుష్పాయుధుండు?
వనిత దనయాత్మలోన నెట్లునిచె నతని.

56


వ.

అని యడిగిన నది యిట్లనియె.

57


తే.

వనితహృదయంబులో నున్నవాఁడ వీవు
నీ ప్రతిచ్ఛాయ మదనుండు నృపవరేణ్య!
యట్లు గాకున్న నశరీరుఁ డయినయతఁడు
పుణ్యశుభమూర్తి దేవరఁ బోలు టెట్లు?

58


వ.

అనిన నృపాలుం డిట్లనియె.

59


తే.

తోఁకచుక్కలఁబోలు దృక్తోయజముల
వెలితి లేకుండ మీబోఁటి చెలులఁ జూచుఁ
గాంత వీక్షింప దరగంటఁ గాని మమ్ము
నేము నేసినయపరాధ మేమి? సెపుమ.

60


క.

భూపాల! మెఱుఁగుఁబోఁడుల
చూపులకంట్రాయి నీదు సొబ గ ట్లగుటన్
మాపిన్నది యిసిఱింతల
చూపుల నరగంట వెఱచుచు న్నినుఁ జూచున్.

61


క.

కలకంఠి దనకు వలసినఁ
‘గలికీ’ యని నిన్నుఁ బిలుచుఁ గలమధురముగా
‘నల’ యను రెండక్షరములు
పలుకఁగ నాలుకకు నెంత భారంబొ కదా?

62


తే.

మగువ దేవరదివ్యనామము జపించు
నెమ్మనమ్మున నిత్యవ్రతమ్ము గాఁగ
నచ్ఛముక్తాఫలైకావళిచ్చలమునఁ
జన్నుగవ నక్షసూత్రంబు సంతరించి.

63