పుట:శృంగారనైషధము (1951).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

శృంగారనైషధము


వ.

అప్పుడు నృపతి సామోపాయంబునం బ్రణయమానం బపనయింపం దలంచి యిట్లనియె.

43


ఉ.

దాస్యము నిన్న రే కుసుమధన్వుఁ డొకండును సాక్షిగా సరో
జాస్య! వహించినాఁడ, విను, మప్పుడ మ్రొక్కుట లేదు, నీకు వి
శ్వాస్యుఁడఁగాన మ్రొక్కుఁగొను స్వస్తటినీసలిలాభిషేకసా
రస్యపవిత్రమస్తకము వ్రాల్చెద నీపదయుగ్మకంబుపై.

44


తే.

కుటిల మగునీకటాక్షంబుఁ గువలయాక్షి!
యించుకించుక నామీఁద నెఱ్ఱఁబాఱి
నిగిడి మరలినభావంబు నిజము దెలిసె
శ్రవణకూపనిపాతైకశంకఁ జూవె?

45


క.

లేయెండ వేఁడి యయ్యుం
దోయజషండముల కింపు దొలఁగించు క్రియన్
నీయలుక పరుసనయ్యును
నాయెడదకు వేడ్క సేయు నళినదళాక్షీ!

46


తే.

చివురుఁ గెమ్మోవిచిఱుగాటు నెపము గాఁగఁ
దామరసనేత్ర! కోపింపఁ దగదు మమ్ము
ఫలరసాస్వాద మొనరించుచిలుకమీఁదఁ
బింబవల్లీమతల్లి కోపించు నెట్లు?

47


తే.

ఉవిద! నీమాట విన నొల్ల మూరకుండు
కా దనక వింటి మే నేమి కారణంబొ?
రాజకీరంబు మము నిష్ఠురంబు లాడుఁ
బ్రతిపదంబును బరుసగాఁ బలుకు వీణ.

48


వ.

అని వెండియు రసావేశంబున.

49