పుట:శృంగారనైషధము (1951).pdf/297

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

శృంగారనైషధము


తే.

దివసముఖకార్యజాతంబుఁ దీర్చి వచ్చు
పతి నెదుర్కొనె భక్తిసంభ్రమ మెలర్పఁ
జెలువ ప్రత్యగ్దిశాసింధుసలిలవీచి
తూర్పుదెస వచ్చునిండుచందురునిఁబోలె.

31


నలదమయంతుల గోష్ఠి

వ.

తరణిఖరకిరణకందళితమందాకినీకనకారవిందంబునకు విందై నిజసందర్శనానందమందస్మితసుందరం బగునయ్యిందువదనవదనంబు మదనరాగంబు సంపాదింప సర్వసర్వంసహానిలింపసార్వభౌముండు.

32


ఉ.

 మానససంప్రమోదము సమగ్రముగా సురలోకవాహినీ
స్నానవిధి ప్రవృత్తివచనంబునఁ జెప్పక చెప్పినట్లు స
మ్మాననఁ ద న్నెదుర్కొనిన మానవతీజనతాలలామకుం
గానుక యిచ్చెఁ దావి వెలి గాని కనత్కనకారవిందమున్.

33


క.

పురుషోత్తమలాలిత య
త్తరుణీమణి మిగుల నొప్పెఁ దత్సమయమునన్
సురసింధుహేమకమలము
కరకమలంబున ధరించి కమలయుఁబోలెన్.

34


తే.

రాజముఖికి నయ్యేకవరాటకంబు
లలితసమానమున నేకలక్ష మయ్యె
రాజకృపఁ గన్న యొక్కవరాటకంబు
నేకలక్షం బగును సంశయింపనేల?

35


వ.

అనంతరంబ విధివిశేషంబు సమాప్తింపంగోరి చకోరలోచనం గడకంట నీక్షించుచు నిషధాధ్యక్షుం డగ్నిహోత్రగృహంబునకుం జని.

36