Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దఱసిన ప్రేమచేత జవదాఁటవు నావచనం బటంచు నే
గరువముఁ లూనియుందుఁ జెలికత్తెలమధ్యమునందు మానినీ!

84


మత్తకోకిల.

ఏను చెప్పినమాట నీ విపు డెంత లేదని చేయఁగాఁ
బూనవేనియు నీకు నా కిఁకఁ బొంద దెప్పుడు భాషణం
బైన నేమి గొఱంత నా కని యాత్మ నెంచితివేని య
ట్లైన శత్రులవాంఛితంబు రయంబునన్ ఫలియింపదే?

85


వసంతతిలక.

మానంబుకల్మి నిటు మాటలు వల్క వేనిన్
మేనన్ వసింపవుసుమీ! యిఁక జీవితంబుల్
కానిమ్ము కోపమునఁ గాంతునిఁ గూడకున్నన్
బ్రాణావనార్థమయినం ప్రియుఁ గూడరాదే?

86


చ.

అని యిటు పల్కి యాసఖి తదంఘ్రులపైఁ బడి లేవకుండినన్
వనిత ప్రియాపరాధభవబంధురకోపకషాయితాక్షియై
నను విన మత్సఖీకృతప్రణామనిరోధముచేతఁ బోలెఁ జ
య్యనఁ బొలయల్క మాని యతియత్నమునన్ గరుణించె వల్లభున్.

87


వ.

మఱియు నొక్కసఖి పురోభాగంబున శీఘ్రగమనంబునం బోవు
నొక్కపురుషునిం గని యిట్లనియె.

88


గీ.

రమణి వెన్కఁ జిక్కె రాజాల కీవు ముం
గలఁ జనంగఁదగునె? కడురయమునఁ
గటికుచోరుభారగరిమచే నెలనాగ
లలసగమన లగుట దెలియవొక్కొ?

89


క.

అని యిటు సఖి పలికిన విని
వనితామణి తన్నుఁ గలయవచ్చిన దాఁకన్
దనయడుగు లెన్నికొను చా
డ్బున మెల్లన నడుగు లిడుచుఁ బోవుచునుండెన్.

90


వ.

మఱియు నొక్కయువతి ముంగలంబోవు ప్రియతమునిం గూడు
టకు శీఘ్రానుధావనంబు ప్రార్థింపుచున్న సఖి కిట్లనియె.

91


తరువోజ.

కలికి! నా కిటు స్వయంగమనలాఘవము
                        గలుగుట నీ కది ఘన మయ్యెనేని
పలుక కిప్పుడె యయ్యవస్థను బొందం
                        గలదాన నని పల్కి కడువేగమునను
బలుచెలితోడఁ గోపవ్యాజమునన
                        యెలమితో నొక్కనాయిక శీఘ్రపాద
తలపాతమగునట్లు తప్పక పఱచి
                        చెలువునితోడఁ జెచ్చెరఁ గూడుకొనియె.

92