Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గాఁగఁ జేసెడు గాఢాంధకారకలన.

365


చ.

అరుదుగ నిందు నీగజవరాశ్రమపుష్పభరావనమ్రసుం
దరకుజమున్ సదానజలదంతిహతం బగుచుండఁ దన్నగో
పరిగతదందశూక మతిబంధురకోపితమై నితాంతభీ
కరవిషవహ్నికీల లదె గ్రక్కుచు నున్నది చూడు మచ్యుతా!

366


చ.

స్మరహరుఁడైన సాంద్రగజచర్మకృతాంబరకృత్యుఁడై తుషా
రరచితమైన శీతనగరాజముపై వసియించె నాఢ్యకే
తరుఁడయినన్ సమస్తఋతుధర్మసుఖప్రదమైన యీమహీ
ధరముపయిన్ వసించి మదిఁ దాల్పఁ డొకించుక ద్వంద్వదుఃఖమున్.

367


సీ.

వితతనూతనశైలవిపినరేఖాశ్యామ
                        మధ్యస్ఫటికమణిమయనితంబ
భూములచేత నీ భూధరరాజంబు
                        భస్మాంగరాగాత్తపాండిముండు
సర్పరాట్పరికరసహితుఁడు నగు త్రిపు
                        రాంతకు తనుశోభ ననుకరించె
మఱియు నీగిరియందు మాధవుల్ వికచాంబు
                        జోభయతటిభృత్సముత్థితోరు


గీ.

నదవినోదితభూరిదినక్లములును
గనకభూషణజనితోరుకాంతు లగుచు
రసవదైక్షవమధు వాని రతికిఁ బ్రియల
యొడలి వలువలు హరియింపుచున్నవారు.

368


సీ.

భానుండు దర్పణస్వచ్ఛకాంచనకంద
                        రాగ్రవర్తి హృదయ హారిరౌప్య
భిత్తిసంక్రాంతప్రవృద్ధతమోహారి
                        ఘనతేజ మాహేమకందరములఁ
బఱుమరు తరుచుగాఁ బ్రతిఫలింపుచు నుండఁ
                        బతులచే నవహృతవసన లైన
యతివల కందరానభిముఖుం డయ్యును
                        జెలఁగి వ్రీడితలఁగాఁ జేయుచున్న


గీ.

వాఁడు నీరాకఁ గని యద్రివాతచలిత
బలపటశ్యామలోత్పతద్బహులశిఖర
కాండసంభ్రమకారి మేఘములచేత
నధికభక్తిఁ బ్రత్యుత్థాన మాచరించె.

369