Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

కమలాక్షుండు నిసర్గరక్తవలయాగ్రస్యూతమాణిక్యర
త్నమరీచిచ్ఛురితంబు లౌట నను వొందన్ నేఁటికిన్ దైత్యవ
ర్యమహోరస్స్థలభేదనోత్థపటురక్తార్ద్రంబులై యున్న చం
దమునన్ బొల్చు లసన్నఖాగ్రముల చేతం జూడ నొప్పెన్ రహిన్.

239


మ.

అతులోదగ్రతమాలనీలము సమగ్రాముక్తముక్తావళీ
లత మై యొప్పు మురారివక్షము విశాలస్ఫూర్తిచే మింట నం
చితగీర్వాణనదీప్రవాహయుగముం జెల్వొంద వేఱ్వేఱ నా
యతలీలం బ్రవహించె నేని సరి సేయన్ వచ్చు నమ్మింటితోన్.

240


మ.

అనిశం బే మణియందు బింబగతబాహ్యస్థప్రపంచంబు త
ద్ఘనదేహంబున నిర్మలత్వమున సాక్షాద్భూతకుక్షిస్థలో
కనికాయంబనఁ జూడ నయ్యెను దదుగ్రక్షీరధిక్షీరసా
రనితాంతద్యుతిదీపితాశమణిసారం బొప్పె వక్షంబునన్.

241


మ.

అకలంకాప్రపదీనచారుకటిసూత్రాలంబిదంతావళే
క్షుకశుక్త్యుద్భవమౌక్తికావళి తదంగుష్ఠాగ్రనిష్ఠ్యూతభ
వ్యకరోర్ధ్వప్రసృతోన్నతాచ్ఛతరగీర్వాణాపగాసంతతో
దకసంపాతము కైవడిం జెలఁగె నుద్యత్కాంతి శోభిల్లఁగన్.

242


ఉ.

చారుతరేంద్రనీలమణిసన్నిభవర్ణతనుండు శౌరి క
ర్పూరపిశంగవాసుఁ డగుచుం బరికింపఁగ నయ్యె వాయుసం
చారవిసృత్వరాంబురుహసాంద్రవిశాలరజోవిచిత్రదు
ద్వారకళిందజాసలిలభారముచాడ్పున నద్భుతంబుగన్.

243


చ.

పరగఁ బ్రసాధితుండయిన పద్మదళాక్షున కన్యలక్ష్మి భా
సురగతి నయ్యె నన్న యది చూడఁగ యుక్త మనన్యకాంత యై
యరుదుగ నిత్యలక్ష్మి హృదయంబున నిల్చె నశేషకాంత యై
సరసత మేన నంతటఁ బ్రసాధనలక్ష్మి వసించెఁ గావునన్.

244