Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

దేవా! శక్యవిషయంబునందు క్షమావంతు లైన యంగవంతు
లకు శక్తిచేత వ్యాయామంబునందు వృద్ధి యగు: శక్త్యతి
క్రమణంబున వ్యాయామం బత్యంతహానికిం గారణం బగుం;
గావునఁ జైద్యాస్కందనం బశ్రేయస్కరం బై యుండు నే
చైద్యుం డుదాత్తుం డగుచు నుదాత్తస్వరంబు స్వరితాదిస్వరం
బులం బోలె శత్రువుల నేకపదంబునందు నీచులం గావించు నట్టి
వాని నవమానింపఁదగ; దదియునుంగాక.

214


గీ.

చెలఁగి యేకాకి యైన యా చేదివిభుఁడు
కలన భేత్తవ్యుఁడని మీరు దలఁప వలదు;
రోగసముదాయమగు క్షయరోగ మట్ల
రాజసముదాయమగువాఁడు, రమ్యచరిత!

215


గీ.

పరగ నార్జితఫలుఁడు సపక్షుఁ డఖిల
పరవిచారణుఁ డైన యాబాణుఁడు గుణ
కలితుఁ డగువానికిఁ గార్ముకంబుచేతఁ
బోలె సంధానితుం డయ్యె బురుషవర్య!

216


క.

విను చేదిపకృతభేదము
తనువైనను నీపయిన్ గృతద్వేషుల దు
ర్జనబాణాదులశిఖి యే
ఱిన సమిధలఁ బోలె బ్రజ్యలింపఁగఁజేయున్.

217


గీ.

అరయఁ గడు క్షుద్రుఁ డైన మహాసహాయుఁ
డగుచుఁ గార్యపారంగతుఁ డై వెలుంగు
శైలతటిని మహానగాసహిత యగుచు
నాపగానాథుఁ బొంది న ట్లనఘచరిత!

218


వ.

మఱియుఁ గాలయవనసాళ్వరుక్మిప్రభృతిరాజులు తమస్స్వభా
వు లగుటం జేసి తిమిరంబు రజనీముఖంబునుం బోలెఁ బ్రకృష్ణ
దోషుండగు శిశుపాలు ననుసరించి వత్తురు.

219


గీ.

భవదమిత్రు లెవ్వ రవనిలోఁ దన్మిత్రు
లెవ్వ రట్టి నృపతు లెల్ల వాని
వేగఁ గూడికొండ్రు విపరీతు లగువారు
నిన్నుఁ గూడికొండ్రు నిక్కువముగ.

220


ఉ.

మీ రిపు డర్థిఁ జేదిపతి మీదికిఁ బోయితిరేని యాజికిన్
వారక ధాత్రిలో నుభయపక్షనృపాలురు గూడికొందు రే
పారఁగ నందునన్ బెలుచ నధ్వరవిఘ్నము గల్గుఁగాన నీ
వారయ ధర్మపుత్రునకు నగ్రవిపక్షుఁడ వయ్యె దెంతయున్.

221