Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

విను సత్కవి శబ్దార్థము
లును బోలె నభిజ్ఞుఁ డెపుడు లోపల దైవం
బును బౌరుషమును రెంటిని
ననువందఁగ నాశ్రయించు నయ్యైవేళన్.

207


వ.

మహాత్మా! శృంగారాదిరససిద్ధికొఱకు రతిహాసశోకక్రోధో
త్సాహభయజుగుప్సావిస్మయశమసంజ్ఞికంబు లైన స్థాయి
భావంబులలో నొక్కస్థాయీభావరూపప్రయోజనంబునఁ దనేక
నిర్వేదాదిసంచారిభావంబు లెట్లు ప్రవర్తించునట్లు సుస్థిరుండును
విజిగీషుండునైన యొక్కనాయకుని యర్థంబునం దనేకరాజులు
ప్రవర్తింతు; రదియునుం గాక.

208


గీ.

పృథివిలోనఁ దన్త్రావాపవిదుఁడు యోగ
కలన ననిశంబు మండలాక్రమణ మర్థిఁ
జేయునట్టి నరేంద్రునిచేత రిపులు
ఫణులక్రియ నిగ్రహింపంగఁ బడుదు, రనఘ!

209


గీ.

మన్త్రశక్తి బృహన్మూలమహితభూరి
రాజితోత్సాహనగము కరప్రచేయ
పృథుతరప్రభుశక్తిని బెంపు మీఱ
సతతము ఫలింపఁజేయును, జలజనేత్ర!

210


సీ.

అధిప! యనల్పత్వ మగుటఁ బ్రధానత్వ
                        మున నంశమునకు సొంపొనర నితర
షడ్జాదికస్వరసంఘంబుకైవడి
                        విజిగీషుఁడగు నరవిభున కన్య
మధ్యమండలవర్తి మనుజేంద్రు లందఱు
                        పొందుగా శేషత్వ మొందియుందు
రత్యనారభమాణుఁ డైనను విభునకుఁ
                        బరులచే నట్లు సంపాదితంబు


గీ.

లైన యర్థంబులన్నియు ననవరతము
పరగ నాకాశమునకు శబ్దంబుఁబోలె
మిక్కిలి గుణత్వమును బొంది నిక్కువముగఁ
జాల వర్తించు, యదుకులసార్వభౌమ!

211


గీ.

ఒనర నేకార్థతంతుసంస్యూత యైన
యట్టి యానవ్యపార్ష్ణిగ్రహాదిముఖ్య
మాలయం దధికద్యుతిఁ గ్రాలు నాయ
కుండు నాయకమణిలీల నుండు నధిప!

212


గీ.

శక్త్యపేక్షుఁ డగుచు షాడ్గుణ్యసిద్ధర
సాయనంబు నర్థి ననుభవించు
నట్టి మనజవిభుని యంగంబు లెంతయు
స్థైర్య మొందు బలయుతంబు లగుచు.

213