Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్రంథంబులు పఠించి సంధివిగ్రహయానాసనద్వైధీభావసమా
శ్రయంబు లనియెడు షడ్గుణంబులును బ్రభుమంత్రోత్సాహంబు
లనియెడు త్రిశక్తులును శక్తిత్రయసాధ్యంబు లైన పురుషార్థ
లాభాత్మకప్రభావసిద్ధిమంత్రసిద్ధ్యుత్సాహసిద్దు లనియెడు
సిద్ధత్రయంబును క్షయవృద్ధిస్థానసంజ్ఞికం బైన యుదయ
త్రయంబును వ్యాఖ్యానంబు సేయుటకు సమర్థు లై యుందు
రనాలోచితకార్యుం డైన వావదూకుని వాగాడంబరం
లక్ష్యంబు వలన స్ఖలితబాణం బైన ధనుష్మంతుని వల్గితంబు
నుంబోలె నిష్ఫలంబగు; సర్వకార్యశరీరంబులందు సౌగతులకు
రూపవేదనావిజ్ఞానసంజ్ఞాసంస్కారంబు లనియెడు స్కంధ
పంచకాతిరిక్తం బైన యాత్మ యెట్లు లే డట్లు రాజులకుఁ
గర్మారంభోపాయపురుషద్రవ్యసంపద్దేశశాలవిభాగవినిపాత
ప్రతీకారకార్యసిద్ధు లనియెడు పంచాంగంబుల కంటె వ్యతి
రిక్తం బైన మంత్రంబు లేదు;

157


గీ.

మఱియు సర్వాంగసంవృతమంత్ర మదియ
ధీరుఁడైన యోధుఁడు పోలెఁ దేజ మలరఁ
బరవిదారణశంకచేఁ బరగఁ బెద్ద
కాల మటు నిల్కడ వహింపఁ జాలదయ్యె.

158


క.

మానుగఁ దన కుదయ మరివి
హీనతయును రెంటి నెఱుఁగు టిది నీతి; పరి
జ్ఞానులు దీనిం గై కొని
పూనిక వాగ్మితను బ్రచురముగఁ జేయఁదగున్.

159


క.

తన కెంత కలిమి గల్గిన
జననాథుఁడు తృప్తి నొందఁ జన దందులకున్
వనరాశి పూర్ణుఁ డయ్యును
ననిశము శశిరాక గోరు టది గుఱి గాదే?

160


క.

ధర నల్పసంపదకు నె
వ్వరు తృప్తి వహింతు రట్టివారిఁ దదల్పా
స్థిరసంపద నల దైవము
చిరకాలము వృద్ధి నొందఁజేయదు ధాత్రిన్.

161


క.

కర మభిమానము గల భూ
వరు లరులను మొదలు ముట్ట వధియింపక యి
ద్ధర సుదయ మొంద రిందుకు
గురుతమము నడంచు రవియె గుఱి యగు ధాత్రిన్.

162