Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

యిన్ద్రసన్దేశమున జనహితమునైన
వచన మచిరంబుగా విన్నపం బొనర్తు;
నింద్రకార్యధుర్యత నొంది యెసఁగు నీవు
ప్రీతితో దాని నంతయు వినఁగవలయు.

105


చ.

విమతులచే నొకింతయును భీతి నెఱుంగనివాఁడు సూర్యతే
జమున వెలుంగువాఁడు దితిజాతుఁ డొకండు గలండు వాఁ డొగిన్
గొమరుగ నింద్రశబ్దమునకుం గల యర్థ మడంచి సంతతం
బు మహితుఁ డై హిరణ్యకశిపుం డనుపేరం జరించు నిత్యమున్.

106


చ.

పరగ సమత్సరుం డగుట, వాఁ డసురుం డనుదారుణాఖ్యకున్
ధరఁ బ్రథమాభిధేయతన దాల్చె; మహాబలుఁడైన వానిచేఁ
జిరగతి దేవతాతతులచిత్తములందు మహాభయంబు సు
స్థిరముగ నించఁగాఁ బడియెఁ; జెప్పెడి దేమి తదుగ్రకృత్యముల్?

107


చ.

హరియమపాశియక్షులు దిశాధిపులైనను వారి వీటిలో
నరయక రాగసంహృతము లై తమ యంతనె సర్వసంపదల్
స్థిరముగ రాక్షసేంద్రుని భజించెఁ దదాదిగ సంపదల్ వసుం
ధర నతిచంచలంబు లని తద్దయు నాడిక గాంచె నెంతయున్.

108


ఉ.

నాకులు దైత్యుధాటికి మనంబున భీతిలుచున్ స్వరూపశో
భైకఫలంబులైన నగరాదులకుం బటుశస్త్రకోటికి
న్వీఁక బలాలి కాయసవినిర్మితకంచుకచాపపాళి క
స్తోకత సంవిధానములు శూరులు చేసిరి పుష్కలంబుగన్.

109


తరల.

భువనసంచరణైకశీలుఁడు భూరినంపద కాశ్రయుం
డవు నిశాచరనాథుఁ డేదిశ కర్థి నేగుఁ దదాశకు
న్దివిజవర్యులు మౌళిబద్ధమణీగళత్క రయుగ్ము లై
యవిరలస్పృహ మూఁడుసంధ్యలయందు మ్రొక్కుదు రెప్పుడున్.

110


చ.

వితతసటాచ్ఛటానిలవిభిన్నఘనంబగు భూరినారసిం
హతనువు దాల్చి ముగ్ధలలనాంచదురోభవసంగభంగురా
యతనఖరంబులన్ ఘనరణావని నద్దనుజేంద్రవక్ష ము
ద్ధతి విదళించి త్రుంచితివి తామరసేక్షణ! నీవు వ్రేల్మిడిన్.

111