Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తుండవు సప్రమదుండ వైననిన్నుఁ బురోభాగంబున ముదితుండై విలోకించుగాక యని యివ్విధంబునం బలికి యూరకున్న శిశు
పాలునిదూత నవలోకించి చక్రపాణిచేత భ్రూసంజ్ఞాప్రేరితుండై కృష్ణా
నుజుండగు సాత్యకి యిట్లనియె.

7


సీ.

ప్రణిధిశేఖర! నీవు బహుచతురుండ వ
                        ప్రియగర్భ మైనట్టిప్రియము మధుర
మగునట్లు పలికితి వదియె మా కిప్పుడు
                        ప్రియగర్భమైన యప్రియము నయ్యె
నరయ వాహ్యంబున కతికోమలంబును
                        నంతరంగంబున కార్ద్రపద్మ
వృత్తకర్కశమయి వెలయు నీ వచనంబు
                        శాకపలాశదేశ్యత వహించె


గీ.

వీనులకు నతిమృదులమై మానసమున
కధికపరుషసూచన మయి యలరు నీదు
వచన మది పింగళాదికపక్షిరుతము
కరణి సన్మార్గగతుల కగ్రాహ్యమయ్యె.

8


గీ.

భూవిభుఁడు కృష్ణునకు నగ్రపూజఁ జేసె
నందు మత్సర మేల మీ యధివిభునకు?
మస్తకమున ససౌరభమహితవృక్ష
సుమము నర్పింప నెవ్వఁ డసూయ సేయు?

9


సీ.

అల్పులమానసం బతితుచ్ఛమైయుండు
                        రయమునఁ దద్గతాప్రియము నుచ్చ
రింతు రంతర్గతాప్రియమును లోపల
                        నిడుకొని యధికులు వెడలనీరు
సతతంబు సుజనుండు సర్వజనోపకా
                        రపరుండు నైయుండు విపుల నతని
యున్నతి ఖలులకు నురుతరహృద్రోగ
                        కారిణియగు విచక్షణుఁడు పరుల


గీ.

సంపద కసూయ పడఁ డెందు సంతసించు
మధ్యముఁడు పరజనులసంపద కసూయ
కల్గియును నోటఁ బుచ్చఁడు కపటి యగుచు
నధముఁ డప్పుడె వెలిఁబుచ్చు నాఁగలేక.

10


క.

ఫలహీననసతి సుమనః
కులపరివర్జిత నవార్యగురుసంతాపన్
ఖలతను ఖలతనువలె మతి
గల బుధుఁ డవలంబనంబు గావించునొకో?

11


గీ.

పరుషములు పల్కు చేదిభూపతికి శౌరి
యించుకేనియు నుత్తరం బీయకుండె
వనదనాదంబునకుఁ బ్రతిధ్వని యొనర్చుఁ
గాక హరి నక్కయఱుపులఁ గలఁకపడునె?

12