Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అనఘాత్మ! ప్రజలకు నతిశుభకారి సు
                        పాత్ర నిక్షిప్తనిర్వ్యసనచిత్తుఁ
డగు సృష్టికర్తచే ననిశంబు ధనసంప
                        దలకును బోలె వేదంబులకును
గర మర్థి దానభోగములనే వ్యయమందుఁ
                        బరఁగ నామ్నాయంబువలన మఱియు
నానంత్యమునఁ జేసి యక్షయుండగు నీవు
                        నిక్షేపముగ ధాత్రి నిర్ణయింప


గీ.

బడితి, వజపుత్ర! నీదృష్టిపాతముననె
యతికృతార్థుండ నైతి నే నైననీదు
గురుతరోక్తులు నాలింపఁ గోరినాఁడ;
శ్రేయమందు నెవ్వాఁడు సంతృప్తి నొందు?

94


వ.

అని యిట్లు ప్రియవచనంబులు పలికి యాగమనప్రయోజనం
బడుగువాఁడై వినయంబున నమ్మునీంద్రునిం జూచి, మహాత్మా!
నిస్పృహుండవైన నిన్నాగమనప్రయోజనం బెయ్యది? యని
యడుగుట మిక్కిలిధార్ష్ట్యంబగు నైనను సముదితాత్మ
గౌరవంబును శ్లాఘ్యంబు నగు భవదీయాగమనంబె మాకు
ధార్ష్ట్యంబు నిచ్చుచున్నదని పలికిన, నమ్మురారి వచనంబు
విని నారదుండు, పురుషో త్తమా! నిస్పృహుండ నని నీవు వచింప
నర్హంబు గాదు; పరమయోగుల కైన నీవు సాక్షాత్కరణీ
యుండ వట్టి నిన్ను సందర్శించు టదియె మాదృశులకుఁ
బ్రయోజనం; బింతకంటె నన్యం బెయ్యది గలదు?

95


సీ.

సముదీర్ణవిషయవాంఛాప్రతిరోధకం
                        బక్షుణ్ణ మగుట జనాళిచేత
నత్యంతదుర్గమంబైన మోక్షపథంబు
                        నొందిన సుమనస్విబృందమునకు
ననపాయసంశ్రయంబైన ప్రాప్యస్థాన
                        మగు దీవు; పూర్వజ్ఞు లైన మునులు
నిగృహీతచిత్తులై నెగడు యోగులచేత
                        నధ్యాత్మదృష్టిచే నధికయత్న


గీ.

మున గృహీతునిఁగా, సర్వభూతమయునిఁ
గాఁ బ్రకృతికంటెఁ బరునిఁగా, ఘనపురాణ
పురుషునిఁగ, సర్వసాక్షిఁగా, భూతములకు
నీశ్వరునిఁగా నెఱుంగుదు, రీశ! నిన్ను.

96


వ.

అని యిట్లు భగవంతుని నిర్గుణస్వరూపంబు వినుతించి ప్రస్తుతో
పయోగిత్వంబున సగుణంబు నాశ్రయించి వెండియు నిట్లనియె.

97