Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డెందమునఁ గనలి వాత
స్పందనజలరాశిరవముచాడ్పునఁ బలికెన్.

263


చ.

గుఱుతుగ సర్వలోకములకున్ విభుఁడున్ గడుపూజ్యుఁడైన యి
మ్మురపరిపంథి యీసభను బాజ్యుఁడు గాఁడని యెవ్వఁ డుద్దతిన్
వెఱవక పల్కునట్టి యవివేకిశిరంబుపయిన్ సభాసదుల్
వరుస నుతింప నా యెడమపాదముఁ బెట్టెద నేఁడు చూడుఁడీ!

264


చ.

అని యిటు జాహ్నవీతనయుఁ డాడిన తద్వచనార్థ మప్పుడే
యనుభవ మైనయట్లు కలుషాకులమానసులై "యితండు తా
మనల గణింప కిట్లు దురహంకృతి నింతటిమాటఁ బల్కునే?"
యని పటురోషసంక్షుభితులై రల చేదిపపక్షభూపతుల్.

265


సీ.

అతులకోపారుణీకృత మౌటచే నీల
                        తారకానుమితోరుతామ్రనయన
మైన బాణాసురు నాననంబు సశంకు
                        వగు సూర్యబింబంబుపగిది లోక
భీకరం బగుచు దీపించె వికాసిత
                        రక్తతరోగ్రనేత్రప్రసూన
దీపుఁడై నిజకాంతిదీప్యమానుండయి
                        యర్యమారుణదేహుఁ డగుచుఁ జాల


గీ.

వెలుఁగు ద్రుముఁ డనునామంబు గలుగురాజు
రెండవవిషద్రుమంబు పోలిక నలరుచు
జనులు భీతిల్లఁ డత్సభాసదనమందుఁ
జూడఁ బడుచుఁ జరించెఁ బ్రస్ఫురణలీల.

266


గీ.

తగ ననిర్వాణవైరాగ్ని యగుట మిగుల
నంతరార్ద్రత విడిచి కోపానిలమున
విహతమై పొగలొందిన వేణుధారి
చే జ్వలితమయ్యె వృక్షంబుచేతఁ బోలె.

267


గీ.

ఉత్తరముఁ జెప్ప నోరెత్త నుత్తమౌజు
రాహువదనకరాళమై క్రాలు ముఖము
లక్షితార్జునదంతమై తక్షణంబ
గ్రస్తశశధర మైనట్లు గాననయ్యె.

268


వ.

మఱియు స్వభావకోపనుం డగుటం జేసి ముఖరాగాదిచిహ్నం
బులచేత నిరంతరంబు కుపితుండైనవానిరూపంబుపగిదిఁ జూ
పట్టు రూపంబుచేతఁ బరిపంథిలోచనభీషణుండైన దంతవక్త్రుని