Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జిత్తంబు విశేషంబుగా విప్రియంబును ప్రాపించి వికారంబు
నొందుటచే యేమిచిత్రం? బివ్విధంబున నాచైద్యుండు మొదలఁ
బూర్వోక్తశిరఃప్రకంపనాదిగాత్రారంభవికారకృతముకుళ
బంధంబును భావికలహఫలయోగంబునైన కోపప్రసవంబు పక్ష్య
మాణవాక్యంబుచేత వికాసంబు నొందింపుచు నిర్భీకుండై సజల
జలదగర్జితగంభీరస్వరుండై యాసభాస్థానంబునందుఁ బ్రతిధ్వనులు
సెలంగ నత్యంతరోషవశంబున నతిపరుషస్ఫుటతరాక్షరంబు
గలవాక్యంబున నిట్లనియె.

238


చ.

నరవరపార్థ! నీవు నరనాథులచేత నపూజ్యమానుఁడౌ
మురపరిపంథి కర్ఘమతి ముఖ్య మటంచు నొసంగి తక్కటా!
స్థిర మతిఁజుట్టమంచు నిటు చేసితి వంతియెకాని పాత్రమం
చెఱిఁగి యొనర్ప లేవయితి వీతఁడు యోగ్యుఁడె? యగ్రపూజకున్.

239


గీ.

రాజగుణము లేని రామానుజుండు రా
జార్హపూజ గొనఁగ నర్హుఁ డగునె?
రాజశిఖులు చుట్టు రాజిల్లుచుండ హ
వ్యంబు గొనఁగఁ గుక్క కర్హమగునె?

240


ఆ.

అనృతవాక్య మాడ వని నీవు పటహవా
ద్యముల మోయఁబడితి వవని నింద్యుఁ
డైన శౌరి కిప్పు డర్ఘ మిచ్చుటఁ జేసి
యదియుఁ గార్యకలన ననృతమయ్యె.

241


చ.

నృపతి యధర్మరాజ వగునీకెటు ధారుణి ధర్మరాజనాఁ
గపటపుఁబేరు గల్గె నటు గల్గుట యుక్త మదెట్టులన్నఁ గ్రూ
రపుకుజవాసరంబునకు గ్రక్కున మంగళవారనామమున్
నిపుణతఁ గల్గలేదె? మఱి నీకును నట్టులఁ గల్గె నామమున్.

242


శా.

కుంతీనందనులార! యీ హరియె మీకుం బూజ్యుఁడౌనేని బల్
సంతోషంబు మఖచ్ఛలంబునఁ దిరస్కారార్థ మాహూతమై
పంతం బొప్పఁగ వచ్చినట్టి నృపతివ్రాతంబు సిగ్గేది మీ
పొంతన్ నిల్వఁగ నేమికార్య మిచటం బోవచ్చు వా రిండ్లకున్.

243