Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మను వచనంబు దాతముఖమందున యాచకవక్త్రమందుఁ దా
వినఁబడదయ్యె నవ్విభుని విత్తవిసర్జనమందు నెంతయున్.

208


సీ.

వందిమాగధసూతవైణికవాంశిక
                        వాదుల కర్హసంభావనంబు
బధిరాంధమూకుల కధికధనంబును
                        భోజనార్థుల కిష్టభోజనంబు
నామయార్తులకు దివ్యరసాయనంబును
                        బ్రసవించుసతులకుఁ బథ్యములును
బీదసాదలకును బెంపుగా విత్తంబు
                        గణికాదులకును బుష్కలధనంబు


గీ.

నడిగి యడగకమున్నె తా నరసియరసి
చాల నిప్పించి యందఱ సత్కరించె
నాగతజనంబులం దొక్కఁ డైనఁగాని
కష్టపడకుండ నందఱు తుష్టు లైరి.

209


సీ.

బహువిధసంస్కృతప్రాకృతంబులఁ గృత
                        పాత్రసంకరములు భావసిద్ధి
సహితంబులైన భోజనములచే నాట
                        కములచేఁ బోలె నఖండరసము
ననుభవించి జనంబు ననుపమానందంబు
                        భరియించె నిబ్భంగిఁ బార్థివుండు
నమ్మహారాజసూయాధ్వరమందు దు
                        ష్టాత్ముల శిక్షించునట్టి హరిని


గీ.

రక్షకునిఁ జేసి సంతత మక్షతంబు
లైన దానంబు హోమంబు యజనములును
గడమవడకుండ దోషంబు స్ఖలనములును
గలుగకుండ నిర్వర్తించెఁ గౌతుకమున.

210


గీ.

జగతి యాజుల కెల్ల నీశౌరి యొకఁడె
సత్సఖుండని తెలిపెడు సరణిదేవ
యజనభూమి చషాలతుల్యాంగుళీయ
యూపమంగుళినట్ల సొంపొంద దాల్చె.

211


ఆ.

ధర్మతనయుఁ డిట్లు తత్క్రతువంతయు
సాంగముగ నొనర్చి యర్ఘదాన
మెవరి కిత్తు ననుచు నింపుతో నడిగిన
సభ వినంగఁ బలికె శాంతనవుఁడు.

212


వ.

నరేంద్రా! గుణదోషకోవిదుండవైన నీవు కర్తవ్యకార్యంబు
లందుఁ బరోపదేశావేక్ష లేకయె నీయంత నీవె యెఱుంగుదు
వైనను గురుని యనుమతి వడసి కాని కార్యంబు సేయకుండు
టది సదాచారపరిపాటి గావున న న్నడుగుట కది కారణంబు