Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ట్లంభోజేక్షణ! యున్నవాఁడ నిటు ధాన్యం బర్థిఁ దూర్పెత్త సం
రంభం బొప్పఁగఁ గర్షకుం డనిలుఁ జేరంగోరుచందంబునన్.

176


మ.

ప్రమదం బొప్పఁగ నీవు సంగతుఁడవై పాలింపుచుండన్ మదీ
యమఖం బించుక విఘ్నదోషములు లే కంతంబుఁ బ్రాపించు దు
ర్దమసూర్యుం డుదయించి భాసిలుచునుండన్ వాసరశ్రీని నీ
క్షమ నెవ్వాఁడు హరింపశక్తుఁ డగు? నో కంజాతపత్రేక్షణా!

177


సీ.

మహిలోన రాజు ధర్మంబు దప్పక యుండఁ
                        జెలఁగి విత్తంబు నార్జింపవలయు
నార్జితవిత్తంబు నధికయత్నంబున
                        రక్షింపవలయును రక్షితార్థ
మెలమితోఁ బాత్రభూతులయందు వినియోగ
                        మొనరింప వలయు ని ట్లునికి లెస్స
యజ్ఞం బనంగ నన్యం బొండుగలదె? య
                        జ్ఞస్వరూపివి నీవె కావె? యధిప!


గీ.

యగ్నిముఖమున హవ్యంబు నవనిదేవ
తాస్యముల నన్నము భుజించి యజ్ఞఫలము
కృప దలర్పంగఁ గర్తకు నిచ్చుదాత
వీవె గావె? మహాత్మ! ని న్నెన్నఁదరమె?

178


ఆ.

అనఘ! నీవు మున్ను యాగంబు గావించి
యవభృథోక్షితుండ వైన వెనుక
నీదుశాసనమున నెమ్మితో రాజసూ
యాధ్వరం బొనర్తు నంచితముగ.

179


వ.

అని యిట్లు యుధిష్ఠిరుండు విన్నవించిన విని యమ్ముకుందుండు
సర్వమహీపతులు వినుచుండ దశనాంశువ్యాజహారంబుచేత
శబలాకారశరీరంబు ధరించి యతని కిట్లనియె.

180


సీ.

జననాథ! నీదు తేజం బదె నిజనీతి
                        మహిమచే సకలభూమండలాది
పతులను సాధించి వశ్యులఁగాఁ జేసె
                        నింక నెవ్వనిచేత నేమి గుణము?
తగఁ బథ్యవృత్తిచేతనె రోగము నశింప
                        నెలమి వైద్యునిచేత నేమి గుణము?
అరిజయభూరక్షణాదిగుణముల శు
                        ద్ధక్షత్రియుండవై తనరు నీదు


గీ.

మ్రోల నెవ్వాఁడు రాజార్హముఖ్యసవన
మర్థిఁ గావింపఁగా శక్తుఁ డవని నుద్ధ