Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యింద్రప్రస్థపురంబు నవలోకించె మఱియు బ్రతిశబ్దపూరిత
దిగంతరాళంబైన సేనాసముద్రంబు తుషారాచలగుహాముఖో
న్ముఖసురనదీప్రవాహంబుకరణిఁ బురద్వారంబు గదియనడిచె
లోకసంరక్షణార్థంబున నకృద్గృహితశరీరసంభవంబుగల యప్పు
రాణపురుషుండు ప్రవిభక్తప్రత్యగ్రగోపురద్వారంబులు గల
యప్పురంబు పంచేంద్రియసమానులైన ధర్మనందనాది పంచ
పాండవులతోఁగూడఁ బ్రవేశించె మఱియును.

139


చ.

హరనయనాగ్నిఁ గ్రాఁగని సుమాస్త్రసమద్యుతిరూపసంపదన్
వఱలెడు పూరుషుల్ మఱియు వారకమున్నటు రాజయక్ష్మరో
గరహితపూర్ణచంద్రనిభకాంతియుతోజ్జ్వలవక్త్రసంపదన్
బరగెడు కామినుల్ గలిగి భాసిలు నప్పురిఁ జొచ్చి రందఱున్.

140


చ.

హరిపటహాదివాద్యనినదార్భటులన్ విహితోపహూత లై
పురితరుణీమణుల్ కుతుకము దొరసేయఁగ సద్మకృత్యముల్
మఱచి మురారిఁ జూచుటకు మక్కువతో నటు వీథివీథికిన్
గరమరుదార వచ్చిరి ముఖద్యుతి వెన్నెల గాయుచుండఁగన్.

141


చ.

మలయుచు వేడ్క నర్ధకృతమండనులై కరరుద్ధనీవులై
గళితమనోజ్ఞచేలలయి గ్రాలువెలందులఁ జూచి సౌధపం
క్తులు పటహప్రతిధ్వనులఁ దోరముగాఁ బ్రకటాట్టహాసమున్
సలిపినకైవడిం దనరెఁ జారుతరంబుగ పర్వవీథులన్.

142


చ.

తత్తరపాటుతో రశన తప్పక పక్షమునందు మంజుభా
స్వత్తరకర్ణపూరములు నారకకేశములందుఁ గంచుకం
బుత్తలపాటుతో నడుమ నొప్పుమెయిన్ మొలచీర చన్నులం
దత్తఱి గుండలంబు లటు హస్తములం ధరియించి రంగనల్.

143


చ.

వెలఁది యొకర్తు కృష్ణముఖవీక్షణరాగవశంబునం బదం
బుల నటు యావకద్రవముఁ బూయుచు నొక్కటిఁ బూయ కంతలో
బొలుపుగ శంకరార్ధతను బొందినగౌరియుఁబోలె మార్గమున్
జెలుపుగ యావకైకపదచిత్రితధాత్రిని జేసె నత్తఱిన్.

144