Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

విశదితాశేషలోకుండు దశశతోస్ర
గాత్రుఁడగు హేళి రెండవకన్నుపోలె
వికసనం బొందుచుండ ద్యోవీథి విగళి
తాంశుసితకరతనువుచే వ్యంగితైక
నయనయైనట్లు చూపట్టె నయనములకు.

54


చ.

కుముదవనంబు మోడ్చె నవకోమల మయ్యె సరోజషండమున్
బ్రమదము వీడెఁ గౌశుకము గ్రాలె ముదంబునఁ జక్ర మబ్జినీ
రమణుఁడు మీఱెఁ జందురుని రమ్యతరద్యుతి జాఱె; దుష్టదై
వము వివిధప్రకారములఁ ప్రాణుల కిచ్చుఁ దదౌచ్ఛ్యనైచ్యముల్.

55


ఉ.

చండకరుండు దిక్సతిని సామియుబోలె క్షణంబు ప్రోష్యుడై
యుండియుఁ బూర్వమార్గమున నొయ్యన నింటికి రాఁగఁ జూచి యం
దుండఁగలేక భీతిగొని యొప్పఱిజారుఁడు వోలెఁ జంద్రుడుం
గండుదొఱంగిపాఱె నటు గ్రక్కునఁ బశ్చిమమార్గగామియై.

56


వ.

మఱియు నఖలతారాలోకంబు విలయంబు నొందించి సర్వాతి
శాయిమహిముండును ధృతిసానురాగలక్ష్మియు నైనసూర్యుండు
విష్ణుండునుంబోలె రాత్రి కల్పావసానంబున గగనమహార్ణవంబు
నధిష్ఠించి యుండె; మఱియుఁ గృతాఖిలలోకప్రబోధుండు నవ
ధూతాంధకారోదయుండు నైనసూర్యుఁడు మహాగుణగరిష్టుం డ
య్యును వినాశితకుముదతారకాలక్ష్మియుఁ గృతకామివియో
గుండు నయ్యును బహుతరగుణదర్శనంబువలన లోకాంగీకృత
స్వల్పదోషుం డగుటంజేసి కృతార్థుండై నీకు సుప్రభాతుం డగుం
గాక యని యాశీర్వదించిరి.

57


చ.

ఇనుఁ డుదయించునంతట మహేభరథాశ్వనిషాదిమేదినీం
ద్రనికరమచ్యుతాలయముద్వారముమ్రోలఁ బ్రయాణకాలయో
గనిరుపమానవేషరచనార్థ మొకించుకసేపు జాగొన
ర్చిన హరిరాక గోరుచు విశేషమతిన్ గనుపట్టె నంతలోన్.

58


వ.

సర్వాలంకారభూషితుండై కృష్ణుండు.

59


గీ.

కాంచనోజ్జ్వలరుచియు స్వక్షము సుపత్ర
మధికజవజితనాగంబునైన తార్క్ష్య
మెక్కి మింటనుబోలె మహీతలంబు
నం దనుద్ఘాతసుఖమార్గమందుఁ జనియె.

60


సీ.

శ్రీశ్రితవక్షు లంచితకరస్థితచక్ర
                        కలితులు ద్విజరాజకాంతు లరయ
సత్యానురక్తులు సాంద్రనరకజిష్ణు
                        లగు భూపతులు వినయాదిసుగుణ
ములచేత హరిఁ గూడి పొలుపొంద నరిగిరి;
                        రమణీయశుచిసతారములు ముకుళి
తములగు పటమంటపములచేఁ దులకుము
                        దాకరంబులచేత నంచితముగఁ