Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నమ్మహాకవిచేతనే యంచితముగఁ
దెనుఁగు సేయించి వేయాఱ్లు ధనము హేమ
భూష లిచ్చి రాధాకృష్ణపుర మనియెడు
నగ్రహారంబులో ద్వాదశాంశ మొసఁగె.

49


ఉ.

రాజితకీర్తి సర్వజనరంజనుఁ డా నరనాథుఁ డొక్కఁడే
రాజనఁ జెల్లుఁ గా కితరరాజులు రాజులె శక్రచంద్రము
ల్రా జనుపేరు దాల్పుట కరంబు నిరర్ధక మెట్టులన్న ఘో
రాజి నొకండు పుణ్యజనహంత యొకండు నిశాటుఁ డారయన్.

50


గీ.

ద్విజవరేణ్యులచే జగద్విశ్రుతముగఁ
బెక్కుమఖములు సేయించి పెంపు వడసెఁ
బుడమివేల్పులకును వేలుపులకుఁ బెక్కు
గ్రామము లొసంగె నమ్మహారాజవరుఁడు.

51


గీ.

అమ్మహారాజశేఖరుం డమితయశుఁడు
లీలతో సర్వసామ్రాజ్య మేలుచుండి
వరుసగా సప్తసన్తానవంతుఁ డగుచు
దనరె భువిలోన రెండవధాతకరణి.

52


క.

అం దగ్రసుతుఁడు రాజపు
రందరుఁ డనఁ బొగడు గనెఁ బురందరకరిరా
ట్కుందేందుయశుఁడు సుగుణా
నందుఁడు గోపాలకృష్ణనరపతి యలరెన్.

53


క.

మును కశ్యపుచే నింద్రుఁడు
ననిమిషపదమందుఁబోలె నటు జనకునిచే
ఘనవేంకటగిరిసింహా
సనమం దభిషిక్తుఁడయ్యె సంభ్రమ మెసగన్.

54


గీ.

శ్రవణరహితుండు కోఱవిసంబు గల్గు
వాఁడు పాండురదేహంబువాఁ డఁ టంచు
నురగపతి రోసి మేదినీతరుణి ప్రీతి
నమ్మహారాజు భుజదండ మాశ్రయించె.

55


గీ.

ఇంద్రుఁ డమరావతీపురం బేలినట్లు
శ్రీదుఁ డలకాపురంబు రక్షించినట్లు
గరిమ నారాజు వేంకటగిరిపురంబు
పాలనము సేయుచుండు నపారయశుఁడు.

56