Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

పదపడి సుశీతలత్వంబు వఱలుచునికిఁ
జర్మమున కెప్పు డంచితస్పర్శసుఖము
నిచ్చుచుఁ దదాసవంబు పంచేంద్రియముల
నధికసంతుష్టి నొందించె నద్భుతముగ.

259


గీ.

మఱియు నున్మదభ్రమదళి మద్యసురభి
ఫుల్లలోచనకామినీముఖము మద్య
పూర్ణచషకంబు గనుఁగొని మొదల నెచట
వ్రాలుదు నటంచు సంశయాక్రాంత మయ్యె.

260


గీ.

ధరితవారుణియగు పానపాత్రమందు
బింబితంబైన యువతిముఖంబు కమల
మని భ్రమించి తుమ్మెద వేగ నచట వ్రాలె;
భ్రమణశీలికిఁ గలదె? తత్త్వప్రచింత.

261


క.

ప్రియురా లొసఁగిన మద్యము
ప్రియుచే నతిమధుర మనుచుఁ బీతం బయ్యెన్
రయమున నచేతనములగు
ప్రియకాంచనమకుటరుచులు పీతం బగుచోన్.

262


గీ.

తరుణి మొదల ద్రావఁ దన్మధురోష్ఠర
సంబు మద్యమందు సంక్రమించె
నదియు భుక్తపూర్వమైనను బ్రియతముఁ
డన్యమద్య మనుచు నారగించె.

263


గీ.

అధికమాధుర్య మొందిన మధురసములు
కాముకుల రమ్యవికచవక్త్రములచేతఁ
జెలువు మీఱ ఘ్రాణంబులచేతఁ గలువ
తావి యేకకాలమునఁ బీతంబు లయ్యె.

264


గీ.

మఱియు నుపదంశకాంక్షియౌ నరుఁడు మధుస
మానమధురాధరంబు నట్లానుచుండ
యానకం బపగతమయ్యు నపుడు దంత
పీడచే వెండి రాగాభివృద్ధి నొందె.

265


వ.

మఱియు సమదనం బగునట్లు మదకారప్రేయసీవదనపానపరుం
డైనకాముకునకు సకృదాస్వాదితమద్యంబె వైపరీత్యంబున
నొక్కక్షణం బుపదంశస్థానంబునం దయ్యె మధుపానాసక్తచిత్తు
లైనవారల కధరాస్వాదం బుపదంశం బగు; మఱియును.

266


గీ.

మద్యపానంబుచేఁ గడుమధురము లగు
కామినీకాముకుల సువక్త్రములచేతఁ
జషకనిహితోత్పలం బళిస్వానరుదిత
మైనక్రియ లజ్జచేఁ గ్రింది కరిగె నపుడు.

267