4) సామాజిక చరిత్ర రచన:
చరిత్ర అంటే సాధారణంగా రాజులు, రాజ్యాలు రాజకీయాలకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి, వాటిలో ప్రధానంగా పాలనా పరమైన అంశాలు, వంశ పరమైన ఆర్థిక వ్యాపార వాణిజ్య విశేషాలు ఉండటం సహజం. కానీ సామాజిక కోణం నుంచి చరిత్రని వ్యాఖ్యానించడం అనేది అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన ప్రయత్నాన్ని చేసి ఒక సామాజిక చరిత్ర రచనలో కొత్త ద్వారాలు తెరిచిన మేధావి - పరబ్రహ్మశాస్త్రి! ఆయన రాసిన “ప్రాచీనాంధ్ర గ్రామీణ జీవనం" అనే గ్రంథం ప్రాచీన కాలంలో తెలుగు నేల పై విలసిల్లిన వివిధ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన శైలి, విధానాలు, సామాజికత ఎలా ఉందో వివరించింది.
5) తెలుగు లిపి పరిణామ క్రమం:
తెలుగు భాష మూలాలు పంపన కన్నా పూర్వమే శాసనాలలో మనకు కనిపిస్తున్నప్పటికీ అంతకంటే వందలాది సంవత్సరాల క్రితమే లిపి లేని కాలంలో మౌఖిక భాషగా ప్రజలందరిలో వాడుకలో ఉన్న భాషగా తెలుగు భాష ఉందనే విషయం కాదనలేనిది. అయితే తెలుగు భాషలో లిపి రూపొందిన తర్వాత ఆ లిపి, పదాలు, అక్షరాలు, వర్ణాలు ఉచ్చారణ కాల క్రమంలో ఎలాంటి పరిణామాలు, మార్పులు చెందినవో వాటన్నిటినీ వివరిస్తూ, (శాసన భాషలో, కావ్య భాషలో, తాళపత్ర గ్రంధాలలో ఉన్న భాషలోని పదాల ఆధారంగా చేసుకొని) “తెలుగు లిపి పరిణామ క్రమం” అనే పరిశోధనా గ్రంధంలో శాస్త్రి గారు చక్కగా విశదీకరించారు.
ఇలా పరబ్రహ్మ శాస్త్రి గారు తెలుగు చరిత్రకు, శాసనాల పరిష్కరణ కు, సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. వారి కృషి ఆధారంగానే తదనంతర కాలపు చరిత్రకారులు తమ పరిశోధనని కొనసాగించి తెలుగుజాతి చరిత్రకు సంబంధించి మరెన్నో విశేషాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. అందుకే తెలుగు జాతి చరిత్ర నిర్మాణానికి పరబ్రహ్మ శాస్త్రి గారి కృషి అనన్య సామాన్యమైనది. వారి సేవ తెలుగుజాతి చరిత్ర ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
అందుకని “పి వి పరబ్రహ్మ శాస్త్రి గారి శతజయంతి" సందర్భంగా ఈ "శాసనోపాసన" అనే పేరుతో వారి జీవన ప్రసానాన్ని తెలిపే గ్రంథాన్ని ప్రచురించడం, వారి చారిత్రక కృషిని, సాహితీ సేవలను "కొండ అద్దమందు కొంచమై ఉండదా” అన్న స్థితిలో చూపించడమే అని భావిస్తాను. ఈ 'మోనోగ్రాఫ్' ను రచించిన ప్రఖ్యాత చరిత్రకారుడు, స్థపతి శ్రీ ఈమని శివనాగిరెడ్డి గారిని, ఆచార్య పి. చెన్నారెడ్డి గారిని అభినందిస్తున్నాను శాస్త్రి గారి జీవన దశలు, ఆయన చేసిన కృషి ఈనాటితరం చిత్రకారులకు ఒక స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం “నాదోపాసన” చేసిన త్యాగరాజస్వామి వంటి కృతికర్తలను చూశాం. "సాహిత్యోపాసన” చేసిన కాళిదాసు లాంటి సృజనశీలురను చదివాం. కానీ పరబ్రహ్మశాస్త్రిగారు "శాసనోపాసన" చేశారు. అందుకే ఆయన జీవన గమనాన్ని తెలిపే ఈ మోనోగ్రాఫ్‌కు ఈ పేరు ఔచిత్యంగా అమరిందని భావిస్తున్నాను.