Jump to content

పుట:శాసనోపాసన.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1) కాకతీయుల వంశ వృక్ష పునర్నిర్మాణం :

11 వ శతాబ్దం నుంచి 1323 వరకు దక్షిణాపథాన్ని విస్తృత ప్రాతిపదికన పరిపాలించిన వంశంగా కాకతీయ చక్రవర్తులు మహోన్నత స్థానాన్ని సాధించారు. వీరికి సంబంధించిన చాలా విషయాలు పరబ్రహ్మ శాస్త్రి గారి కంటే పూర్వం అంతగా వెలుగులోకి రాలేదు. కాకతీయ గణపతి దేవుడు వేయించిన "బయ్యారం, ఇతర శాసనాల ఆధారంగా కాకతీయుల వంశ వృక్షాన్ని ఆధార సహితంగా ఆయన నిరూపించి చూపించడంతో కాకతీయ చక్రవర్తుల పాలనాకాలాల గురించిన వివరాలు తొలిసారిగా తెలిసాయి.

ఇలా కాకర్త్య గుండన నుంచి మొదలుకుని ప్రతాపరుద్రుడి వరకు కాకతీయ చక్రవర్తుల వంశ క్రమణిక ని సాధికారికంగా ప్రకటించడం గొప్ప విశేషం. దీనివల్ల కాకతీయ కాలపు ఎన్నో విశేషాలు వెలుగులోకి వచ్చాయి.

అలాగే “రాయగజకేసరి" అనే బిరుదు ఏ కాకతీయ చక్రవర్తి కి ఉండేది? అనే విషయంలో అప్పట్లో చరిత్రకారులలో సందిగ్ధత నెలకొని ఉండేది. పరబ్రహ్మ శాస్త్రి గారు తను చేసిన శాసనాల పరిశోధనల ఆధారంగా కాకతీయ మహారాణి రుద్రమదేవి కే “రాయగజకేసరి” అనే బిరుదు వుందనే విషయాన్ని నిరూపించారు. దాంతోపాటు చందుపట్ల శాసనాన్ని పరిష్కరించి రుద్రమదేవి మరణం తన 80వ ఏట 1289 లో సంభవించిందని నిర్ధారించ గలిగారు (గతంలో రుద్రమదేవి మరణానికి సంబంధించి చరిత్రకారులు అభిప్రాయపడింది 1296 సంవత్సరం అని)

ఇలా కాకతీయ చక్రవర్తులకు సంబంధించి మరెన్నో విషయాలు వాస్తు శిల్ప రీతులను, దేవాలయ నిర్మాణ శైలి రీతులను, చెరువుల నిర్మాణాన్ని, నగర నిర్మాణాన్ని, కోట నిర్మాణానికి సంబంధించిన వ్యూహాలను పరబ్రహ్మ శాస్త్రి గారు పరిష్కరించి కాకతీయ చరిత్రకు సంపూర్ణతను తెచ్చారు.

2) శాతవాహనులకు సంబంధించిన పరిశోధనలు:

'సిముక' రాజు ద్వారా శాతవాహన వంశం ప్రారంభించబడి దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు భారతదేశంలో గొప్ప సామ్రాజ్యంగా పరిగణించబడింది అనేది మనందరికీ తెలుసు. కానీ శాతవాహన చక్రవర్తుల వంశానుక్రమణికను మొదటిసారిగా పరిష్కరించి సాధికారికంగా వ్యక్తం చేసింది మాత్రం పరబ్రహ్మ శాస్త్రి గారే! కోటిలింగాలలో లభించిన శాతవాహన కాలపు నాణాలను, ఇతర శాసనాలను ఆధారంగా చేసుకొని వారు శాతవాహనుల వంశానుక్రమణిక ని రూపొందించారు.

3) జిల్లా శాసన సంపుటాలు:

పరబ్రహ్మ శాస్త్రి గారు ఆయనకు దొరికిన శాసనాలని, వాటిలోని విశేషాలని పరిష్కరించి వాటన్నిటినీ జిల్లాల వారీగా సంపుటాల లాగా ప్రచురించి శాసనాలలోని అంతర్గత విశేషాలను ఎన్నింటినో గ్రంధస్థం చేసి భావితరాలకు కరదీపికలుగా అందించారు.