ఈ శాసనాల ని ఆనాటి కాలంలో ప్రధానంగా లోహాల పైన, కర్రల పైన, రాతి స్తంభాల మీద వేసిన దాఖలాలున్నాయి వాటిలోని సాహిత్య విషయాలని, భాషాపరమైన అంశాలని వివరించడం, విశ్లేషించడం ద్వారా చరిత్రకు గొప్ప ఆధార భూమికను రూపొందించవచ్చు. ఇలా "శాసన శాస్త్రం" (Epigraphy) ద్వారా చరిత్రని విశ్లేషించే ఒక ప్రక్రియ కొనసాగుతూ వస్తున్నప్పటికీ శాసనాలలో ఉపయోగించిన భాష, ఆ కాలమునాటి లిపి, పదాలు, వాక్య నిర్మాణం ఇవన్నీ ప్రత్యేకతని సంతరించుకున్న అధ్యయన అంశాలు! ఇది ప్రస్తుత భాషకు భిన్నంగా వైవిధ్యతతో ఉండటమనేది సహజమే! ఇలా కష్టమైన, క్లిష్టమైన శాసన శాస్త్ర అంశాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా చరిత్రని నిర్మించే ప్రక్రియని సుసంపన్నం చేసిన పురాచరిత్ర పరిశోధకుడు, ప్రాతఃస్మరణీయుడు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి గారు!
తెలుగువారి చరిత్రను, తెలంగాణ చరిత్రను వారు చేసిన పరిశోధనలు ఎంతో సుసంపన్నం చేశాయి. మనకు తెలియని మన చరిత్రలోని ఎన్నో మరుగున పడ్డ అంశాలని ప్రపంచానికి చాటి చెప్పాయి! అందుకే తెలుగు నేల మీద విరాజిల్లిన చరిత్రకారులలో ఆదిరాజు వీరభద్రరావు, చిలుకూరి వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వెంకటరమణయ్య లాంటి మహనీయుల కోవలో నిలిచే శాశ్వత కీర్తిని సాధించిన పరిశోధకులు పరబ్రహ్మ శాస్త్రి గారు! వారు చేసిన పరిశోధనలను లోతుగా పరిశీలించిన తర్వాత వారు, వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు పరంగా పరబ్రహ్మ శాస్త్రి... కానీ వారు చేసిన పనులు, సేవల దృష్ట్యా వారు "శాసనాల శాస్త్రి" గా, “నాణాల శాస్త్రి" గా, “సామాజిక చరిత్ర శాస్త్రి” గా, "లిపి శాస్త్రి" గా ఆయనలోని భిన్నకోణాలు నాకు అర్థమయ్యాయి.
పరబ్రహ్మ శాస్త్రి గారు గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, పెద్ద కొండూరు గ్రామంలో 1921 ప్రాంతంలో స్వాతంత్ర్యానికి పూర్వమే జన్మించినప్పటికీ 1948లోనే తెలంగాణ ప్రాంతానికి వచ్చేసి జనగామ లో ఉండే ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మూడేళ్ల కీ 1951 లో హైదరాబాద్ కి వచ్చి అక్కడ కేశవ మెమోరియల్ స్కూల్ లో గణితం, సైన్స్ ఉపాధ్యాయుడు గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 1959 లో పురావస్తు శాఖ లో చేరి తన పరిశోధనల్ని పదునుపెట్టి రిటైర్మెంట్ అయ్యేంతవరకూ, అయిన తర్వాత కూడా చరిత్ర పై మక్కువతో వేలాది పరిశోధనలు నిర్వహించారు
పరబ్రహ్మ శాస్త్రి గారు 1959 నుంచి మొదలెట్టి 1977 మధ్య కాలంలో తెలుగు ప్రాంతాల్లోని వేర్వేరు ప్రదేశాలను సందర్శించి దాదాపు రెండు వేలకు పైగా శాసనాలను సేకరించి, ఆ శాసనాలలోని విశేషాలన్నీ పరిష్కరించి ప్రపంచానికి వెల్లడి చేశారు. వారికి బహుభాషలలో పాండిత్యం ఉండటంవల్ల ప్రాకృత శాసనాలని, సంస్కృత, తెలుగు, కన్నడ భాషలలో ఉండే శాసనాలని కూడా చదివి వాటిని పరిష్కరించడమే కాకుండా, చరిత్రకు తెలియని ఎన్నో విషయాలను ఆ శాసనాల ఆధారంగా లోకానికి చాటి చెప్పారు. ఇలా చరిత్రపరంగా పరబ్రహ్మశాస్త్రి గారు విస్తృతమైన పరిశోధన చేసినప్పటికీ వారు చేసిన పరిశోధనలను ఐదు అంశాల నుంచి పరిశీలించవచ్చని నా భావన.