సంపాదకీయం
పురాచరిత్ర విశ్లేషణ - పరిశోధనల ‘శాస్త్రి'!
చరిత్ర ఒక నిత్య చెలిమె!
తవ్విన కొద్దీ ఊటలా నిరంతరాయంగా ప్రవహించే జీవ నది చరిత్ర!
అలాంటి చరిత్ర భారతదేశంలో ఎంత ప్రాచీనతను (Antiquity), విశిష్టతను (Uniqueness) కలిగి ఉందో తెలంగాణ ప్రాంతంలో కూడా అంతే ప్రాచీనతను, ఔన్నత్యాన్ని కలిగి ఉండడం విశేషం
తెలంగాణ నేల గోండ్వానా ల్యాండ్ లో భాగంగా ఆదిమానవుడి (Primitive Man) సంచార జ్ఞాపకాల నెలవుగా ఆ తర్వాత గొప్ప సామ్రాజ్యాలకు ఆలవాలంగా షోడశ మహాజనపదాల కాలంలో, శాతవాహన కాలంలో, కాకతీయ కాలంలో ఆ తర్వాత వివిధ ముస్లిం రాజుల పాలనా కాలాలలో తెలంగాణ నేల తనదైన ప్రత్యేకతతో భారతదేశ చరిత్రలోనే విశిష్ట స్థానాన్ని సాధించింది.
ఇలాంటి చరిత్రని ముఖ్యంగా ప్రాచీన, మధ్య యుగాలకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేయడంలో ఆనాటి కాలపు సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక అంశాలను విశ్లేషించడంలో ఆధారాలు గా నిలుస్తున్నవి శాసనాలే! మరుగునపడి భూమి పొరలలో నిక్షిప్తమైన చరిత్రని, చరిత్ర తాలూకు విశేషాలని ఆవిష్కరించడానికి మనకు ఉన్న ఆధారాలు - "శాసనాలు, నిర్మాణాలు, కట్టడాలు, తాళపత్ర గ్రంధాలు" లాంటి పురావస్తువులే! వాటిలో శాసనాలను అధ్యయనం చేయడం అనేది బహుళ నైపుణ్యాలతో కూడిన విషయం. శాసన పరిశోధనకు చారిత్రక జ్ఞానంతో పాటు, భాషా జ్ఞాతం, లిపి పరిణామం వంటి ఎన్నో అంశాలపై గట్టి పట్టు ఉండాలి.