Jump to content

పుట:శాసనోపాసన.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలగోని కృష్ణగౌడ్, జి.సి.శేఖర్‌రెడ్డి, కె. సరోజినీదేవి, సీ.ఎస్. వాసుదేవన్, వీ.సీ. శ్రీవాస్తవ, పి. శశిరేఖ, ఎన్. క్యూ. పంకజ్, ఆర్. నాగస్వామి, బి. విద్యాధరరావుల వ్యాసాలు; సాధారణ విషయాలు అన్న నాలుగో విభాగంలో, కె.కె.ఎన్. కురుప్, డి.పి. దూబే, శంకర్‌గోయల్, చల్లపల్లి స్వరూపరాణి, జానమద్ది హనుమశ్ఛాస్త్రి, ఆర్. నటరాజన్, బి. రామచంద్రారెడ్డి, వి.సుగణాశర్మ, శర్మిష్ట ఆద్య, కె. శ్రీనివాసులు వ్యాసాలున్నాయి.

మొదటి సంపుటం 212 పేజీలు, రెండో సంపుటం 219 పేజీలతో, ఏవీ నరసింహమూర్తి, పి. చెన్నారెడ్డి, ఎన్నెస్ రామచంద్రమూర్తి, పరబ్రహ్మశాస్త్రిగారిపైన రాసిన వ్యాసాలు, సద్గురు శివానందమూర్తిగారి ముందుమాటతో న్యూఢిల్లీలోని శారదా పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది.

శాస్త్రిగారికి ఇష్టమైన తెలుగుగోష్టి

ప్రముఖ విజ్ఞాన సర్వస్వసంకలన నిపుణులు చీమకుర్తి శేషగిరిరావుగారి అధ్యక్షతన ప్రతి రెండో శనివారం, ఆంధ్రయువతీ మండలి కేంద్రంలో జరిగే తెలుగు గోష్టి చర్చా కార్యక్రమాల్లో శాస్త్రిగారు చురుగ్గా పాల్గొనేవారు. ఏదైనా పాత విషయంపై పునరాలోచన, కొత్త విషయంపై చర్చోపచర్చలు అక్కడ ఆసక్తికరంగా సాగేవి. నేనూ హాజరౌతుండేవాణ్ణి. ఆ సంస్థ తెలుగు మఱుగులు, తెలుగులో ప్రాకృత పదాలు, శ్రీఉత్పత్తిపిడుగు లాంటి పరిశోధక పుస్తకాల్ని ప్రచురించింది. పరబ్రహ్మశాస్త్రిగారు శాతవాహనుల పుట్టుక గురించి కోటిలింగాల తవ్వకాల ఆధారంగా తెలుగు గోష్టిలో ప్రసంగించి, అందరి ఆమోదం తరువాతే, శాతవాహనా ఎపోఖ్ - ఏ న్యూలైట్ అన్న పుస్తకాన్ని ప్రచురించారు. ఆ సంస్థ ఉపాధ్యక్షులుగా, యువ పరిశోధకులను ప్రోత్సహించి, సంస్థను బలోపేతం గావించారు.

ఆయన లేరని ఎవరన్నారు?

సంప్రదాయ కుటుంబంలో పుట్టి, సంస్కారాన్ని ఔపోసన పట్టి, నిష్టతో, ఇష్టంగా శాసనాలనే శ్వాసనాళాలుగా, పరిశోధన, ప్రచురణలే పరమావధిగా జీవించిన పీవీపీ శాస్త్రిగారు శాసన పరిశోధన రంగంలో మహామహోపాధ్యాయుడు. తెలుగువారి చరిత్రను సుసంపన్నం చేసిన అభినవ వాగనుశాసనుడు. శాసనాలున్నంత కాలం, శాస్త్రిగారు జీవించే ఉంటారు. ఆయన ఎక్కడికీ వెళ్లలేదు. శాసనంలోని ప్రతి అక్షరంలోనూ నక్షత్రంగా భాసిల్లుతూ తెలుగు శాసన పరిశోధకులకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు.

-ఈమని శివనాగిరెడ్డి - స్థపతి

M: 9848598446

20