Jump to content

పుట:శాసనోపాసన.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రముఖ శాసన పరిశోధకుల సాంగత్యంలో శాస్త్రిగారు

రాష్ట్రపురావస్తుశాఖ, శాసన విభాగంలో పనిచేసినపుడు, ప్రసిద్ధ శాసన పరిశోధకులైన నేలటూరి వెంకటరమణయ్య, పీ.బీ.దేశాయి, జి.ఎస్. గాయ్, కె.వి.రమేష్, పీ.ఎల్. గుప్త, ఐ.కె. శర్మ, అజయమిత్రశాస్త్రి, వి.వి. కృష్ణశాస్త్రి లాంటి మహామహులతో కలసి వారి సాంగత్యంలో శాసనపరిశోధనలో పట్టుసాధించారు. అంతేకాదు, అదేశాఖలో, తన పర్యవేక్షణలో పనిచేసిన ఎం.వి.ఎన్.ఆదిత్యశర్మ, ఎన్. ముకుందరావు, మాలకొండారెడ్డి, జి. జవహర్‌లాల్, ఎస్. ఎస్. రామచంద్రమూర్తి, ఏ. మురళీమోహన్‌లను ప్రామాణిక శాసన పరిశోధకులుగా తీర్చిదిద్దారు పరబ్రహ్మశాస్త్రిగారు.

శాసన విభాగంలో శాసన ముద్రలను సేకరించే పి. నారాయణ, ఎం. కొమరయ్య, రహీం, నిర్మల్‌సాగర్లను తన కుటుంబ సభ్యులుగా ఆదరించారు. అందుకనే, వారంతా, ఎర్రబస్సులో ప్రయాణించి, గ్రామ పొలాలు, పొలిమేరల్లో కూరుకు పోయి ఉన్న అనేక శాసన నకళ్లను అలవోకగా తెచ్చి శాస్త్రిగారికి అందించేవారు. వందల, వేల శాసన ముద్రలు పేరుకు పోతున్న నేపథ్యంలో, వాటిని గ్రామం, తాలూకా, జిల్లా, రాజవంశం, రాజు, తేదీ, భాష, లిపి వారీగా విభజించి, ఒక చోట భద్రపరచాల్సిన అవసరాన్ని గుర్తించిన పరబ్రహ్మశాస్త్రిగారు, అలా ఒక పట్టికను తయారించటానికి, కొమరయ్యకు ఎస్టాంపేజ్ కీపర్‌గా పదోన్నతినిచ్చారు. ఆ క్రమంలోనే, శాసనాలపై వార్షిక నివేదికలు, జిల్లా సంపుటాలు ప్రచురించారు. ఈ క్రమంలో, 3 వార్షిక నివేదికలు, 8 జిల్లా సంపుటాలు, 6 ఎపిగ్రాఫియా ఆంధ్రికాలు ప్రచురించబడినాయి.

శ్రీశైలం నీటిముంపు, గ్రామాల శాసనాల తరలింపు

శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపుకు గురైన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 102 గ్రామాల్లో ఉన్న శాసనాలను గుర్తించే పనిని చేపట్టి, తెలుగువారి చరిత్రను జలసమాధి నుంచి కాపాడారు. కాలి నడకన ఊరూరాతిరిగి, శాసననకళ్లను సేకరించి భద్రపరిచారు. పునరావాసంలో భాగంగా ఖాళీ అవుతున్న ఊళ్లలో ఏ మాత్రం సౌకర్యాలు లేకున్నా, అటుకులు, మరమరాలు మంచినీటితో ఆకలి, దప్పికలు తీర్చుకొని, శాసనాల సేకరించిన పరబ్రహ్మశాస్త్రి గారిలాంటి మరో తెలుగు శాసన పరిశోధకుడు లేడేమో!

సన్మానాలు, సత్కారాలు

నిత్యానుష్ఠాన నిష్టాగరిష్ఠుడైన పరబ్రహ్మశాస్త్రిగారు తన కిష్టమైన శాసన సేకరణ, పరిష్కరణ, ప్రచురణ రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను దేశంలోని అనేక ప్రామాణిక పరిశోధన సంస్థలు ఆయన్ను ఘనంగా సత్కరించి తమను తాము గౌరవించుకొన్నాయి. వాటిలో కొన్ని:

18