భట్టోపాధ్యాయుడు మంథని శాసన రచయిత అనీ, ప్రతాపరుద్రుని ఖండవల్లి శాసనాన్ని ఇందులూరి అన్నయమంత్రి రాశాడనీ, రుద్రమదేవి కాలపు బూదపుర శాసనాన్ని (క్రీ.శ. 1272) చిత్రకవిత చెప్పటంలో దిట్ట అయిన రెండో ఈశ్వర భట్టోపాద్యాయుడు రచించాడని చెప్పారు.
విశ్వేశ్వరశివాచార్యుని కొడుకు నరసింహర్షి, వరంగల్లోని ఉర్సుగుట్టపై సిద్ధోద్వాహమనే అసంపూర్ణ కావ్యాన్ని రాశాడని, అందులో శార్దూల విక్రీడితము, స్రగ్ధర వృత్తాలున్నాయనీ, కావ్యం శృంగార ప్రబంధంలా సాగిందనీ, తొలిసారిగా తెలుగు పాఠకులకు అందించిన ఘనతను శాస్త్రిగారు దక్కించుకొన్నారు.
కేవలం సంస్కృత శాసనాల రచయితలు, వాటి కావ్య లక్షణాలనే కాక, కాకతీయుల కాలంనాటి తెలుగు శాసన సాహిత్యంపై కూడా విశేష పరిశోధనగావించారు పరబ్రహ్మశాస్త్రిగారు. క్రీ.శ.1135 నాటి బెక్కల్లు శాసనం, గంగాధరమంత్రి నగునూరు, గణపతిదేవుని ఉప్పరపల్లి శాసనాలు గద్య పద్యాలతో కావ్యశైలిలోనున్నట్లు పేర్కొన్నారు. అదే క్రమంలో మాటేడు (క్రీ.శ. 1120), గూడూరు (క్రీ.శ. 1124), నిడుబ్రోలు (క్రీ.శ. 1132 ఇందులోని సీసపద్యాలు), మొరిపిరాల (క్రీ.శ. 1181) శాసనాల్లోని తెలుగు, సంస్కృత సాహితీ వైభవాన్ని మనకందించి, శాసన పరిశోధనలో కొత్త వరవడిని సృష్టించారు.
రామకాశ్యప నాణేలు పృధ్వీమూలరాజువేనన్న శాస్త్రిగారు
తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలో దొరికిన 'రామకాశ్యప' నాణేలు ఎవరివో తెలియక సతమతమౌతున్న చరిత్రకారులకు ఊరట కలిగించారు పరబ్రహ్మశాస్త్రిగారు. ఈ నాణేలు పిఠాపురం నుంచి పాలించిన రణదుర్జయ వంశానికి చెందిన పృధ్వీమూల మహారాజు (క్రీ.శ.568-617) వేనని చెప్పారు.
విజయనగర తెలుగు శాసనాలను గ్రంథస్తం చేసిన శాస్త్రిగారు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసర్చ్ (ఐసీహెచ్ఆర్) న్యూఢిల్లీ వారు మన దేశాన్నేలిన వివిధ రాజవంశాలు విడుదల చేసిన ప్రాంతీయ భాషా శాసనాలను ప్రత్యేక సంపుటాలుగా ప్రచురించే పథకాన్ని చేపట్టారు. అందులో భాగంగా, కాకతీయుల తెలుగు శాసనాలపై ఎస్.ఎస్.రామచంద్రమూర్తిగారికి, విజయనగర తెలుగు శాసనాలపై పీ.వీ. పరబ్రహ్మశాస్త్రిగారికి సంపుటాలను వెలువరించే బాధ్యతను అప్పజెప్పారు. విజయనగర రాజులు / చక్రవర్తులు, వారి ఉన్నతోద్యోగులు తెలుగు నేలపై విడుదల చేసిన అన్ని తెలుగు శాసనాలను సేకరించి, తెలుగు ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అన్న పుస్తకాన్ని ఐసీహెచ్ఆర్ ద్వారా మనకందించారు పరబ్రహ్మశాస్త్రిగారు.
17