Jump to content

పుట:శాసనోపాసన.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందుకు వారి అనుమతిని పొందేవారన్న సంగతి తెలిసిందన్నారు. ఇలా శాసనాల ద్వారా తెలుగువారికి సంబంధించిన అనేక కొత్త చారిత్రక విషయాలు వెలుగులోకి వచ్చాయనీ, వీటన్నింటినీ పురావస్తుశాఖ వివిధ గ్రంధాలుగా ప్రచురించిందని కూడా శాస్త్రిగారన్నారు.

'ధరణికోట సీల్ రీ ఎగ్జామిన్డ్' అన్న వ్యాసంలో, అంతకు ముందు రాఘవాచారి, ఐ.కె. శర్మలు వెల్లడించిన అభిప్రాయాలను శాస్త్రిగారు సవరించి, ఆ ముద్రికపైన గల శాసనం 'స్కంధశాల' అని, ఆ బొమ్మ, స్కంధుని సూచిస్తుందనీ, తద్వారా క్రీ.పూ. 1వ శతాబ్దికే, ధరణికోటలో కార్తికేయునికి ఒక ఆలయముండేదన్న కొత్త విషయాన్ని తెలియజేశారు.

'సీల్ ఆఫ్ నిజగలి' (1984) అన్న వ్యాసంలో నాసిక్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసర్చి ఇన్ న్యూమిస్‌మెటిక్స్ (అంజనేరి)లో ఉన్న క్రీ.శ. 9వ శతాబ్ది అక్షరాల్లో ఉన్న 'శ్రీనిజగలి' అన్న శాసనం, వరాహముద్రలను పరిశీలించిన పరబ్రహ్మశాస్త్రిగారు, 'నిజగలి' అనే వ్యక్తి చాళుక్య వంశానికి చెందిన ఒక స్థానిక పాలకుడనీ, అతడు, పశ్చిమ గాంగ రాజు రెండోమారసింహుని క్రీ.శ. 962 నాటి కడలూరి శాసనంలో పేర్కొన్న నిజగలి అనీ, అతని కుమార్తె జాకాంబ, గాంగరాజు రెండో ఎరెగంగని భార్య అనీ, అతడు రాష్ట్ర కూటులు పశ్చిమగాంగుల సామంతుడై ఉంటాడని చెప్పారు.

'సాంస్క్రిట్ ఇన్‌స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రదేశ వ్యాసంలో, తెలుగునేలపై సంస్కృత శాసనాలు ఇక్ష్వాకుల కాలంలో అభీరవసుసేనుని నాగార్జునకొండ శాసనం మొదటిదని ఎహువల శాంతమూలుని పాతగండిగూడెం శాసనం, ఇంకా విజయశాతకర్ణి చేబ్రోలు శాసనాలు బయల్పడలేదు. తొలిపల్లవ, సాలంకాయన, తొలి తూర్పు చాళుక్య, తూర్పుగంగ శాసనాల్లో ప్రశస్తులు లేవని, ఊళ్లు, వ్యక్తుల పేర్లు మాత్రం తెలుగులో ఉన్నాయనీ శాస్త్రిగారు పేర్కొన్నారు.

తూర్పు చాళుక్య రాజు గుణగవిజయాదిత్యుడు (క్రీ.శ. 848-892) విడుదల చేసిన సాతులూరు రాగిరేకు శాసనాన్ని ఒక చంపూకావ్యంగా మలిచాడనీ, అందులో అతని గుణగణాలు ఉపమ, శ్లేషాలంకారాల్లో వివరించబడినాయని సోదాహరణంగా వివరించారు. అలాగే, రాజరాజనరేంద్రుని కోరుమిల్లి, కలిదిండి, నందంపూడి, మండ రాగిరేకు శాసనాలు కూడా కావ్యాలను పోలిఉన్నాయనీ, కోరుమిల్లి శాసనంలో 24 పాదాలతో తెలుగు రగడ ఉందని వివరించారు. కాకతీయ రుద్రదేవుని అనుమకొండ శాసనాన్ని అచింతేంద్రయతి, కావ్యశైలిలో రాశాడనీ, జాయపసేనాని చేబ్రోలు శాసనం, గణపతిదేవుని పాకాల చెరువు, కలువకొలను, గణపేశ్వరం శాసనాలను ఆయన ఆస్థానకవి (పేరు తెలియదుగానీ) కవిచక్రవర్తి కావ్య శైలిలో రాశాడనీ తెలిపారు. ఈ వ్యాసంలో, సంస్కృత శాసనాల్లోని కవితాధోరణులను అలంకారాలతో సహా గుర్తించారు శాస్త్రిగారు.

'బొండాడ గ్రాంట్ ఆఫ్ చాళుక్య విష్ణువర్థన' వ్యాసంలో ఉస్మానియా యూనివర్సిటీ, పురావస్తుశాఖ అధిపతి, ఆచార్య ఎం. రాధాకృష్ణశర్మ, రాష్ట్ర పురావస్తుశాఖకు అప్పగించిన 3 రాగిరేకుల శాసనాన్ని పరబ్రహ్మశాస్త్రిగారు పరిశీలించి ఈ శాసనం క్రీ.శ. 7-8 శతాబ్దాల నాటి తెలుగు, కన్నడ లిపిలో ఉందని, తూర్పు చాళుక్య ప్రశస్తితో ప్రారంభమై, మంగియువరాజు

15