అసఫ్జాహీల పాలన ప్రారంభం, తీరాంధ్రలో ఐరోపా వర్తక సంఘాల కార్యకలాపాలు, బ్రిటీష్ ఈస్టిండియా, ఫ్రెంచి, డచ్వారు ఆంధ్రలో పాతుకుపోయిన విషయాలను పేర్కొన్నారు.
ఆంధ్ర, తెలంగాణాల్లో బ్రిటీషు, నిజాంలపాలన, ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ఏర్పాటు, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకూ, ఇతర చరిత్ర పుస్తకాల్లో లేని ముఖ్యమైన ఘట్టాలను శాస్త్రిగారు ఈ చిన్న పుస్తకంలో ఇమిడ్చారు. ఇది తెలుగు వారి చరిత్రకు సంక్షిప్త కరదీపిక.
విజయనగర సామ్రాజ్య ప్రాశస్త్యాన్ని కళ్లెదుట నిలిపిన శాస్త్రిగారు
దారి తప్పిన ధర్మ, పునరుద్ధరణకై విద్యారణ్యస్వామి పూనుకొని, విజయనగర రాజ్యాన్ని స్థాపించి, ఆ తరువాత, సంగమ వంశం 9 మంది చక్రవర్తులు, సాళువ వంశం ఇద్దరు రాజులు, తుళువ వంశంలో 4 గురు రాజులు పాలించి, విజయనగర సామ్రాజ్యాన్ని వైభవోపేతంగావించారనీ, క్రీ.శ.1565లో రాక్షసి తంగడి యుద్ధంలో అళియ రామరాయలి మరణంతో, విజయనగర సామ్రాజ్యం పతనమైందనీ ఆ తరువాత, ఆరవీడు వంశం క్రీ.శ.1663 వరకూ పెనుగొండ, చంద్రగిరి నుంచి పాలించిందని, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు అన్న వ్యాసంలో పరబ్రహ్మశాస్త్రిగారు వివరించారు. అంతేకాక తుళువ వంశాంబుధిచంద్రుడైన శ్రీకృష్ణదేవరాయలు కవులను వాస్తు, శిల్పకళలను ప్రోత్సహించి, తానే స్వయంగా ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రాసి, దేశభాషలందు తెలుగులెస్స అని ప్రకటించి, తెలుగు భాషకు పట్టంకట్టాడనీ, విజయనగర సామ్రాజ్యమే లేకపోతే తెలుగు, కన్నడ, తమిళ భాషలు నేటి భాషలుగా మిగిలేవి కావని, భారతీయ సంస్కృతి నిలిచేది కాదని చెప్పారు.
తెలుగు భాషాప్రాచీనతను ప్రామాణికంగా నిరూపించిన శాస్త్రిగారు
ఒకే జాతి ప్రజలకు రెండు పేర్లుండటం విచిత్రమనీ, తెలుగు వారికి జాతి, భాషలను తెలిపే తెలింగ, ఆంధ్ర పేర్లుండటం మరీ విచిత్రమని శాస్త్రిగారు తెలుగు భాషా ప్రాచీనత అన్న వ్యాసంలో రాశారు.
ప్రజలు మాట్లాడే భాషగా, తెలుగు చాలా ప్రాచీనకాలం నుంచే ఉండేదని, ఊర్లు, కొండలు, పనిముట్లు, నదులు, గింజలు, పశువులు, చుట్టరికాలను సూచించే తెలుగు పదాలు రుజువు చేస్తున్నాయని శాస్త్రిగారు సోదాహరణంగా వివరించారు. నాగలి, కాడి, మేడి అనే పదాలు ప్రాకృతం నుంచి తెలుగులోకి వచ్చాయని, అశోకుని కంటే ముందే భిన్నమైన అక్షరమాల ఉండేదని, క్రీ.శ.1-2శతాబ్దాల్లో సాతవాహన రాజులు తమ నాణేలపై వారి పేర్లను ప్రాకృతంతో పాటు, తెలుగులో వేయించుకొన్నారని, హాలుని గాధా సప్తశతిలో అనేక తెలుగు పదాలు ప్రాకృతంలోకి మార్చబడినాయని, క్రీ.శ.4 శతాబ్ది నుంచి సంస్కృత పదాలు కూడా తెలుగు భాషలో చేరాయని, క్రీ.పూ. కనీసం రెండు వేల ఏండ్ల కిందటే తెలుగు వ్యవహారభాషగా ఉండేదనీ, క్రీ.పూ. 3వ శతాబ్దిలో ఆ భాషకు రాతపుట్టిందనీ, తెలుగుకు బౌద్ధ సంపర్కం వల్ల ఆంధ్ర, అంధక, ఆంధ్రమనే పేర్లు వచ్చాయనీ, సాహిత్య, సంగీతాలకు అనువైన భాష తెలుంగు అని శాస్త్రిగారు పేర్కొన్నారు.
13