Jump to content

పుట:శాసనోపాసన.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీ.శ.8-10 శతాబ్దాల్లో తెలంగాణా, రాయలసీమల్లో రాష్ట్రకూటులపాలన, వేములవాడ చాళుక్యుల పాలనలో తెలంగాణ, రాయలసీమలో వైదుంబ, నొలంబ రాజుల పాలన, రాష్ట్రకూటుల పాలన అంతం, అలంపూరు, బోధన్, అమరావతి, వేములవాడ మొదలైన చోట్ల దేవాలయాల నిర్మాణం, వేంగీపాలకుడైన విమలాదిత్యుడు తమిళ దేశంలో రక్షణ పొందటం ముఖ్యవిషయాలు.

క్రీ.శ. 11వ శతాబ్దంలో వేంగీలో అరాచకం, శక్తివర్మతో శాంతి పునరుద్ధరణ, రాజరాజచోళుడు తన కూతురు కుందవను విమలాదిత్యునికిచ్చి వివాహం జరిపించటంతో వేంగీరాష్ట్రం బలపడింది. రాజరాజనరేంద్రుని కాలంలో నన్నయ మహాభారతాన్ని తెలుగించటం, రాజరాజనరేంద్రుని కుమారుడు తెలుగు తమిళ రాజ్యాల నేలి కులోత్తుంగ చోళునిగా బిరుదు ధరించటం, పంచారామాలు ప్రశస్తిలోకి రావటం, తెలంగాణలో కళ్యాణ చాళుక్యుల పాలనలో సామంతులుగా కందూరు చోడ, కాకతీయులు, పొలవాస రాజుల పాలన ప్రారంభం, కలింగలో తూర్పు గాంగుల ప్రాభవం చెప్పుకోదగ్గ అంశాలు.

క్రీ.శ. 12వ శతాబ్దిలో వెలనాటి చోళులు, పల్నాటి హైహయులు, కోటరాజులు, కొణిదెన, నెల్లూరు తెలుగుచోళులు, కొండపడమటి రాజులు, పిఠాపురం, నిడదవోలు, యలమంచిలి చాళుక్యుల పుట్టుక, కొలను, ఉండి, దివిసీమలో స్థానిక రాజుల పాలన, కాకతీయ రుద్రదేవునితో క్రీ.శ. 1163 నుంచి కాకతీయులు హనుమకొండ నుంచి స్వతంత్రపాలకులు గావటం, క్రీ.శ.13వ శతాబ్దంలో తెలుగునేలంతా కాకతీయుల పాలనలోకి రావటం, ఆలయ నిర్మాణం, కవిపోషణలో స్వర్ణయుగాన్ని అందించిన గణపతిదేవుని కాలంలో వెలసిన కీర్తి తోరణాలు, తిక్కన మహాభారత తెలుగు అనువాదం, వరంగల్‌లో నరసింహకవి కావ్యరచన, ఘియాసుద్దీన్ తుగ్లక్ దాడితో క్రీ.శ. 1323లో కాకతీయుల పతనం, ఆ తరువాత

ముసునూరి నాయకుల స్వతంత్రపోరాటం, ప్రోలయ, కాపయ నాయకుల పాలన, వెలమనాయకులు రాచకొండ నుంచి, రెడ్డిరాజులు కొండవీటి నుంచి పాలించటం విజయనగర సామ్రాజ్యానికి పునాదులు, మొదలైన విషయాలను కాలానుక్రమణిక పట్టీలతో అందించారు పరబ్రహ్మశాస్త్రిగారు.

క్రీ.శ.15వ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్య విస్తరణ, కొండవీడు, రాజమహేంద్ర వర రెడ్డిరాజుల పాలన అంతం, తీరాంధ్రలో సూర్యవంశ గజపతుల చొరబాటు, వెలమరాజ్య పతనం లాంటి విషయాలను శాస్త్రిగారు పొందుపరచారు.

క్రీ.శ.16వ శతాబ్దిలో విజయనగర పాలకుడు సాళువ నరసింహరాయలు, గజపతులను కట్టడి చేయటం, బహమనీ రాజ్యం బలహీనపడటం, కుతుబ్‌షాహీల పాలన ప్రారంభం, శ్రీకృష్ణదేవరాయలు తూర్పు జైత్రయాత్రలో తీరాంధ్రతో పాటు కటకం వరకూ జయించి, ఆలయాలకు విశేషంగా దానాలు చేయటం, అష్టదిగ్గజాలు, తాళ్లపాక అన్నమయ్య లాంటి కవుల సాహితీకృషి తరువాత విజయనగర సామ్రాజ్యం, దక్కను సుల్తానుల చేతిలో పతనం, హైదరాబాదునగర నిర్మాణం ముఖ్యాంశాలు. క్రీ.శ. 17వ శతాబ్దిలో కుతుబ్‌షాహీల పతనం, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గొల్కొండ స్వాధీనం, క్రీ.శ. 18వ శతాబ్దిలో, హైదరాబాదు నుంచి

12