శాసనాలు, ధాన్యకటకం, భట్టిప్రోలు స్థూపనిర్మాణంతో బౌద్ధం వేళ్లూనుకోవడం, మౌర్యుల పతనం తరువాత, క్రీ.శ.2వ శతాబ్దిలో, శుంగులు, కాణ్వుల చివరిరోజుల్లో తెలంగాణలో, స్థానిక రాజులైన గోబద, సిరికంవాయ, సిరినరన, సమగోప అనే రాజులు, ఆంధ్రలో రాజాసోమక, ఇంకా మహారధిరాజుల పాలనలో ఉంది. క్రీ.పూ.1వ శతాబ్దిలో కళింగకు చెందిన మహామేఘవాహన ఖారవెలుడు క్రీ.పూ. 50వ ప్రాంతంలో, ఆంధ్రను పాలిస్తున్న మొదటి శాతకర్ణిని ఓడించాడు. తరువాత సిముక శాతకర్ణి, క్రీ.పూ.30 ప్రాంతంలో కోటిలింగాల నుంచి పాలించి, రాజ్యాన్ని ఉత్తరంగా విస్తరించి, మగధ వరకూ వెళ్లాడు. పశ్చిమాన బారుకచ్ఛ, సోపార రేవులను జయించి, సువిశాల భూభాగంలో వర్తక, వాణిజ్యాల వ్యాప్తికి దోహదం చేశాడు. సిముకుణ్ణి శాతవాహన రాజ్య మూలపురుషునిగా పురాణాలు పేర్కొన్నాయి. నానేఘాట్లో ఆయన కుటుంబీకుల శిల్పాలున్నాయి.
వీరాపురం తవ్వకాల్లో బయల్పడిన హకుసిరి నాణేలపై గల ప్రాకృత, రోమన్ శాసనాల వల్ల క్రీ.శ. 1వ శతాబ్దిలో రోముతో వర్తకాన్ని చేసిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈనాణెంపైన హకుసిరి పేరుతో పాటు రోమన్ చక్రవర్తి టిబీరియస్ (క్రీ.శ. 14-37) బొమ్మ ఉండటం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొంది. ఇదే కాలంలో తీరాంధ్ర సద వంశీయుల పాలనలో ఉన్నట్లు గుంటుపల్లి స్థంభ శాసనం చెబుతుంది. క్రీ.శ. 2వ శతాబ్దిలో గౌతమీపుత్రశాతకర్ణి తీరాంధ్రపై పట్టు సాధించాడు, ఆ తరువాత వాసిష్టీపుత్ర రెండో పులుమావి, గౌతమీపుత్ర యజ్ఞశాతకర్ణి విడుదల చేసిన ఓడగుర్తు గల నాణేలు, ఆ కాలంలో తీరాంధ్రలో మచిలీపట్నం, కృష్ణపట్నం మొదలైన రేవుపట్టణాలు విదేశీ వర్తకంతో విలసిల్లినవైనాన్ని తెలియజేస్తున్నాయి.
క్రీ.శ.3వ శతాబ్దిలో శాతవాహన పాలన అంతం, ఇక్ష్వాకులు నాగార్జునకొండ (శ్రీపర్వత విజయపురి) నుంచి పాలన, పతాక స్థాయిలో అమరావతి బౌద్ధ శిల్పకళ బౌద్ధానికి ప్రజాదరణతో మహాయాన విజృంభణ మొదలైన విషయాలు చోటు చేసుకొన్నాయి.
క్రీ.శ.4వ శతాబ్దంలో కృష్ణా తీరంలో పల్లవులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రినులు తెరపైకి వచ్చారు. వేంగి నుంచి సాలంకాయనుల పాలన ప్రారంభమైంది. బౌద్ధం తెరమరుగైంది. బ్రాహ్మణ అగ్రహారాలు వెలిశాయి. ప్రాకృత శాసనాలు తగ్గి సంస్కృత శాసనాలొచ్చాయి. సముద్రగుప్తుని విజయయాత్ర తీరాంధ్రపైగా సాగింది. సముద్రగుప్తుని దండయాత్రతో ఏర్పడిన అఖండ భారత్లో ఆంధ్రదేశం ఒక భాగమైంది.
క్రీ.శ.5వ శతాబ్దిలో పల్లవులు, సాలంకాయనులు ఆంధ్రలో, వశిష్టులు, మాఠరులు, కలింగలో, విష్ణుకుండినులు తెలంగాణాలో పాలకులైనారు. సంస్కృత శాసనాల్లో తెలుగుపదాలు కనిపించటం ప్రారంభమైంది. క్రీ.శ.6వ శతాబ్దిలో, విష్ణుకుండినుల పతనం, రణదుర్జయ, మూలరాజ వంశాల పాలన, ఇక్కడి చాళుక్యులు బాదామీ వరకూ వెళ్లటం, కలింగలో తూర్పుగాంగుల పాలన, కడప ప్రాంతంలో రేనాటిచోళుల పాలన, రేనాటిచోళులు పూర్తి తెలుగు శాసనాలను విడుదల చేయటం, పౌరాణిక మత ఆదరణ ముఖ్య ఘట్టాలు. క్రీ.శ. 7వ శతాబ్దిలో రెండో పులకేశి తీరాంధ్రను జయించి, తన తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషేకం చేయటంతో తూర్పుచాళుక్య రాజ్య ప్రారంభం, హుయన్త్సాంగ్ ధాన్యకటక సందర్శన, చిత్తూరు ప్రాంతంలో బాణరాజుల పాలన ముఖ్యవిషయాలు.
11