పుస్తకంలో పొందుపరచారు. కొండూరును కొండ్రూరనేవారనీ, శైవబ్రాహ్మణుడైన కన్దనృపుడు గ్రామ నాయకుడని, కాకతీయ ప్రతాపరుద్రుని ఉద్యోగి మాయిదేవలెంక కొండూరు స్థలపాలకుడని చెప్పారు. గుడిసానులు, అమ్ముకడ సుంకం, బంటెలాయము, తలారిసుంకం లాంటి అలనాటి పన్నుల గురించి వివరించి, చరిత్ర విద్యార్థులు, అధ్యాపకులకు మార్గదర్శకులైనారు.
తెలంగాణా-ఆంధ్ర చరిత్రలో ప్రధాన ఘట్టాలను గుర్తించిన శాస్త్రిగారు...
రాష్ట్ర పురావస్తుశాఖలో చేరిన దగ్గరనుంచి, 2012వ సం॥ వరకూ శాసనాలు, నాణేల పరిశోధన ద్వారా, అనేక కొత్త చారిత్రక విషయాలను అందించిన పరబ్రహ్మశాస్త్రిగారు ఆంధ్ర-తెలంగాణా చరిత్రలోని ఖాళీలను పూరించారు. ఆ క్రమంలోనే, రెండు ప్రాంతాల చరిత్రలో మరుగునపడిన ప్రధాన ఘట్టాలను గ్లీనింగ్స్ ఇన్ తెలింగ– ఆంధ్ర హిస్టరీ త్రూ సెంచరీస్ అనే పుస్తకాన్ని తానే 2012లో ప్రచురించి, పంచి పెట్టారు. అలా ఆ అరుదైన ఆ పుస్తకాన్ని అందుకొన్న వాళ్లలో నేనొకణ్ణి.
అట్టమీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పటం, వెనుక క్రీ.పూ. 3వ శతాబ్ది భట్టిప్రోలు శాసనముద్ర, లోపలి అట్టల్లో భట్టిప్రోలు శాసనాక్షరమాల, తెలుగు లిపి పరిణామక్రమ (స్వంతదస్తూరితో) చిత్రాలున్నాయి. కవరేజీ మీద -
“కారే రాజులు? రాజ్యముల్ గల్గవే? గర్వోన్నతింబొందరే?
వారేరీ? సిరిమూటఁ గట్టికొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనంగలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే! ఇక్కాలమున్ భార్గవా?”
అన్న బమ్మెరపోతన పద్యాన్నిచ్చి, చరిత్రను సృష్టించిన రాజులు కొందరైతే చరిత్రలో చోటుదక్కించుకోని రాజులెందరో అని, ఈ నాటి పాలకులకు చురకలంటించారు శాస్త్రిగారు.
ఇక లోపలిపేజీల్లో, గోదావరినదికి ఉత్తరాన కలింగ, దక్షిణాన తెలింగ ప్రాంతాలున్నాయని, క్రీ.పూ.5 నుంచి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వరకు గల ప్రధాన ఘట్టాలను పేర్కొన్నారు. ఈ పుస్తకం వెలువడిన 2012 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉంది. రాష్ట్రం ఇంకా విడిపోనందున ఆ అంశం ప్రస్తావనకు రాలేదు. ఆయన మాటల్లో ఆయా వివరాలు:
క్రీ.పూ. 5వ శతాబ్ది
ఉత్తరాదితో గల సంబంధాలవల్ల, అస్మక జనపదానికి బౌద్ధధమ్మ వ్యాప్తి వల్ల, ఉత్తరాది బ్రాహ్మణులు తెలుగు నేలపైకి వచ్చి, వైదిక గురుకులాల్ని స్థాపించారని అలాంటి వారిలో కాత్యాయనుడు, బౌద్ధాయనుడు, అపస్తంబుడు ముఖ్యులనీ, ఇదే కాలంలో వ్యవసాయ విస్తరణ, వ్యాపార సంబంధాలు కూడ కొత్త రాజకీయ నేపథ్యానికి దోహదం చేశాయనీ చెప్పారు.
క్రీ.పూ. 3వ శతాబ్ది
మౌర్యచంద్రగుప్తుని గ్రీకు రాయబారి మెగస్తనీసు ఆంధ్రుల ప్రస్తావన, ఆంధ్రలో అశోకుని
10