తొలిగ్రామీణ జీవన విధానాన్ని సమీక్షించటమే కాక, చారిత్రక తొలి, మధ్య కాలాల్లో రాజులు, గ్రామభోజకులను నియమించేవారని దాంతో తమ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి సమర్పించాల్సి వచ్చిందనీ, రెండో దశలో, గ్రామాల్లో మత పరంగా జాతీయ భావన పెరిగిందనీ, సమాజం పౌరాణిక బ్రాహ్మణ మత ప్రభావానికి లోనైందని తేల్చి చెప్పారు. వివిధ రాజ వంశాల పాలనా కాలాలను కూడా ఈ పుస్తకంలో నిక్కచ్చిగా అందించారు.
ఇంకా, గ్రామాల్లో వర్ణవ్యవస్థ, గ్రామసేవకుల జాబితా, కాలు అనే గ్రామాధికారి ఉండేవాడనీ, తరువాత గాముండ, రట్టగుడి, రట్ట, రడ్డి, రెడ్డిగా పిలువబడినాడని కుల, మత సంఘాలు, న్యాయ నిర్వహణ కోసం గ్రామసభ, నేరము - శిక్ష, భూమి యాజమాన్యం, సర్వే, భూముల్లో రకాలు, దాన, భిక్షుహల, దేవహల, బ్రహ్మదేయ, అగ్రహారాలు, పరిహారాలు, పన్నస, భూదానాల రద్దు, పన్నుల్లో భాగం, భోగం, పోరు, ఉంచ మరుంచ, మరుమన్న, వెన్ను పన్ను, ఫలం, తలారి పన్ను, వృత్తి పన్ను, ఆస్థిపన్ను, వివాహ పన్ను, యువరాజ పన్ను, పడవాలపన్ను, పడియార పన్ను, సంధి విగ్రహిపన్ను, రకరకాల వాణిజ్య సుంకాలు, వర్తక - వాణిజ్య సరణి సంఘాలు - నిర్వహణ, రవాణా సాధనాలు, విదేశీ వర్తకం, ఎగుమతులు, దిగుమతులు, చివరగా నాణేలు. (లిపిలేనివి, లిపిగలవి) రాజుముఖచిత్రంగల వెండినాణేలు, రోమను నాణేలు, క్షాత్రపనాణేలు, శాతవాహన, సదవంశీయుల నాణేలు, వాటి తయారీ, కార్షాపణం, దీనారం, పణం, నిష్క, మాడ అన్ని నాణేల పేర్లు, ఆర్థిక వ్యవస్థలను, శాసనాధారాలతో స్వయం పరిశీలనలో నిగ్గుదేల్చిన నిజాల సమాహారంగా శాస్త్రిగారు ప్రాచీనాంధ్ర దేశ చరిత్రః గ్రామీణ జీవనం అన్న ఒక సమగ్ర గ్రంథాన్ని మనకు అందించారు. ప్రతి తెలుగు వాడూ, తన ఇంట, వెంట ఉంచుకోవాల్సిన పుస్తకం ఇది.
అరుదైన అర్థనారీశ్వర ప్రతిమను గుర్తించిన శాస్త్రిగారు...
ఉన్నఊరు, కన్నతల్లి సమానమన్న నానుడిని శాస్త్రిగారు నిరూపించారు. ఎక్కడెక్కడివో వెయ్యికి పైగా శాసనాలను పరిశీలించి, విడమరచి చెప్పి, తెలుగు వారి చరిత్రను మలుపు తిప్పిన శాస్త్రిగారు, తాను పుట్టి పెరిగిన పెదకొండూరు గ్రామంపై విస్తృత పరిశోధనలు గావించారు. గ్రామానికి ఆపేరెలా వచ్చిందో, ఆవూరిచారిత్రక ప్రాశస్త్యమేమిటో శిల్పాలు, శాసనాల ద్వారా పెదకొండూరు ఆలయాలు, శాసనాలు అన్న పుస్తకాన్ని రచించి, స్థానిక చరిత్ర ఎలా రాయాలో సూచించారు.
పెదకొండూరు గ్రామ చరిత్ర అధ్యయనంలో భాగంగా, ఆయన ఆనందేశ్వరాలయంలోని పల్నాటి సున్నపురాతి శివలింగాన్ని పరిశీలించి, అది క్రీ.శ. 4వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనందగోత్రినుల కాలానికి చెందినదనీ, దానిపై ముందుభాగాన, అర్థనారీశ్వర (శివ-పార్వతి) శిల్పం చెక్కబడిందనీ, రెండు తెలుగు రాష్ట్రాలల్లోనే కాక మన దేశపు శివలింగంపై గల తొలి అర్ధనారి శిల్పమని ప్రతిమా లక్షణాన్ని బట్టి తెలియజేశారు.
గ్రామంలోని రాజరాజేశ్వర, జనార్ధనస్వామి, పుట్టలమ్మ గుళ్లు, శిల్పాలు, క్రీ.శ. 1135, క్రీ.శ. 1170, క్రీ.శ. 1173, క్రీ.శ. 1317 సం॥ల నాటి శాసనాల వివరాలను కూడ ఆ
9