Jump to content

పుట:శాసనోపాసన.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దృష్టినాకర్షించింది. బాదామీచాళుక్య మొదటి, రెండో పులకేశి రాజులకు 'సత్యాశ్రయ' బిరుదందని, క్రీ.శ. 540, 610 లలో వారి పాలన ప్రారంభమైందని, వీరిద్దరిలో ఒకరి భటుడు, ఇక్కడ ఒక నమూనా ఆలయాన్ని చెక్కించాడని, ఆ రాజులిద్దరి కాలంలో శివనందీశ్వరాలయం నిర్మించబడిందని, చలికి విషయంగా పేరొందిన ఈ ప్రాంతం నుంచే చాళుక్యులు, బాదామీకి వెళ్లి అక్కణ్ణించి పాలించటం ప్రారంభిచారని బాదామీ చాళుక్య చరిత్రను తిరగ రాశారు.

శాతవాహన చరిత్రకు కొత్త ఆధారాలను అందించిన శాస్త్రిగారు

శాతవాహనుల చరిత్రకు సంబంధించిన అనేక సమస్యలను శాస్త్రిగారు తన నిశిత పరిశోధన, పరిశీలనల ద్వారా పరిష్కరించారు. పురాణాల్లో పేర్కొన్నట్లు శాతవాహనులు ఆంధ్రజాతీయులని, తొలిశాతవాహన రాజులు అశోకుని సమకాలికులు కారని, సిముకుని కంటే ముందు శాతవాహనుడున్నాడనీ, అతని కుమారుడు మొదటి శాతకర్ణి అనీ, వీరిద్దరి తర్వాతే ఈ వంశానికి శాతవాహన అనే పేరొచ్చిందనీ, క్రీ.పూ. 30లో మొదటి శాతకర్ణి కుమారుడైన సిముకుడు స్వతంత్ర పాలన ప్రారంభించాడనీ తేల్చి చెప్పారు.

ఇంకా, మొదటి శాతకర్ణి చివరి కుమారుడైన హకుసిరి, క్రీ.శ. 14-37 మధ్య పాలించిన రోమను చక్రవర్తి టిబీరియస్ సమకాలికుడనీ, వీరాపురం తవ్వకాల్లో బయల్పడిన వెండిపూతగల ఒక సీసపు నాణెం బొమ్మ భాగంలో టిబీరియస్ బొమ్మపై సీజర్ ఆగస్ట్ అన్న చిన్న రోమను శాసనం, వెనుకవైపు మరో రాజు బొమ్మ, ఇంకా 'రణోహకన సతకనస' అని బ్రాహ్మీలిపి శాసనం ఈ విషయాన్ని రుజువు చేస్తుందని శాస్త్రిగారు తొలిసారిగా నిరూపించి, ప్రకటించి, కొత్త చారిత్రక ఆధారాన్నందించారు. పిఎల్. గుప్త, టీవీజీ శాస్త్రిగారలు ఈ నాణెంపై సరైన అధ్యయనం చేయకుండా, వెలిబుచ్చిన అభిప్రాయాలు తప్పని, శాస్త్రిగారు చెబుతూ, ఈ నాణెం ఒక వ్యాపారికి ఇక్కడ వ్యాపారం చేయటానికి టిబీరియస్ ఇచ్చిన లైసెన్స్ టోకెను అనీ, అందుకు స్థానిక పాలకుడైన హకుసిరి తన ఆమోదాన్ని తెలిపినట్లు ఈ నాణెంపై గల హకుసిరి బొమ్మ, శాసనాలు తెలియజేస్తున్నాయని శాస్త్రిగారు చెప్పారు. పురాణాల్లో ప్రస్తావించబడని, నాసిక్ గుహలో నాగనిక చెక్కించిన హకుసిరి బొమ్మకు ఈ నాణెం మరింత చారిత్రకతను జోడిస్తుందని శాస్త్రిగారి అభిప్రాయాన్ని ప్రముఖ నాణేల పరిశోధకులు, చరిత్రకారులు ఆమోదించటమేకాక ఆయన్ను అభినందించారు కూడా.

తెలుగు లిపి ఆవిర్భావ, వికాసాలపై శాస్త్రిగారి అద్వితీయ పరిశోధన

పరబ్రహ్మశాస్త్రిగారు, ఎన్నెస్ రామచంద్రమూర్తి గారితో కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం, హైదరాబాదు సంచాలకులు ఆచార్య జయధీర్ తిరుమలరావుగారి కోరికమేరకు 2012లో తెలుగు స్క్రిప్టు -ఆరిజన్ అండ్ ఎవల్యూషన్‌ అన్న ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. తెలుగు లిపి ఆవిర్భావ వికాసాలు అన్న తెలుగు అనువాద గ్రంథాన్ని కూడా ఆ సంస్థే ప్రచురించింది.

7