Jump to content

పుట:శాసనోపాసన.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరీంనగర్‌లో కాలినడకన విస్తృతంగా పర్యటిస్తుండగా, ఉన్నట్టుండి ఒక చోట పెద్ద వర్షం పడుతుంది. తలదాచుకోవటానికి ఒక పశువుల కొట్టాన్ని ఆశ్రయించగా, అక్కడ కనిపించిన ఒక పెద్ద మనిషి, ఇచ్చిన సమాచారం, శాతావాహన చరిత్రను కొత్త మలుపు తిప్పుతుందని శాస్త్రిగారు కూడా అనుకోలేదు.

ఆ పెద్ద మనిషి, కప్పారావుపేట దగ్గర గల మునులగుట్ట అనే కొండ మీద కొన్ని గుహలున్నాయని చెప్పాడు. శాస్త్రిగారు వెంటనే అక్కడికెళ్లి, ఆ గుహలో చదును చేసుకొన్న నేల పరుపులను గుర్తించి, అవి జైనమునులు జీవితం చివరి దశలో ఆహారాన్ని తీసుకోకుండా, మరణాన్ని ఆహ్వానించే, సల్లేఖనవ్రత స్థావరాలని గుర్తించారు. అంతేకాదు, చుట్టు పక్కల జరిపిన పరిశోధనల్లో శాస్త్రిగారికి సాతకర్ణి నాణేలు దొరికాయి. గ్రామస్తులు, సమీపంలో గల కోటిలింగాల గ్రామంలో ఇలాంటి నాణేలు పెద్ద సంఖ్యలో దొరుకుతున్నాయని చెప్పగా, ఆ ప్రాంతాన్ని చూడాల్సిందే ననుకొని హైదరాబాదు తిరిగొచ్చారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు, ధర్మపురికి చెందిన సంగనభట్ల నరహరిగారు, కోటిలింగాల నుంచి తాను సేకరించిన నాణేలను శాస్త్రి గారికి ఇచ్చాడు. పరిశీలించిన శాస్త్రిగారు, ఆ నాణేలపై గల గోబద, కంవాయ, సమగోప, సాతవాహన, సాతకర్ణి, చిముక శాతవాహన, పులుమావి అనే రాజుల పేర్లను గుర్తించారు. మరింత క్షుణ్ణంగా పరిశోధించి, ఆ నాణేలు ఆంధ్రదేశచరిత్రకు కొత్త ఆధారాలని, శాతవాహన చరిత్రను పునర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయని శాస్త్రిగారు అభిప్రాయపడినారు. ఇంతలో రాష్ట్ర పురావస్తుశాఖ, వి. వి. కృష్ణశాస్త్రి గారి నేతృత్వంలో ఎన్నెస్ రామచంద్రమూర్తి గారు కోటిలింగాల వద్ద తవ్వకాలు చేపట్టి, పొరల్ని నిర్ణయించి, వెలువడిన పురాతన వస్తువులు, కట్టడాలు, నాణేల ఆధారంగా ఒక నివేదికను పొందుపరచారు. ఈ నివేదిక ఆధారంగా, తన పరిశోధనలను జోడించి అనేక కొత్త చారిత్రకాంశాలతో శాస్త్రిగారు సాతవాహన ఎపోక్- ఏ న్యూ లైట్ అన్న పుస్తకాన్ని 1994లో తెలుగు గోష్ఠి తరపున ప్రచురించారు. బహుళ ప్రజాదరణ చూరగొన్న ఈ పుస్తకం అందుబాటులో లేకపోవటంతో, శాస్త్రిగారే దీన్ని మళ్లీ 1996లో ముద్రించారు.

ఈ పుస్తకం ద్వారా శాస్త్రిగారు అనేక కొత్త విషయాలను అందించారు. సాతహహనుల కంటే ముందు తెలంగాణాను, గోబద, కంవాయ, నరన, సమగోప అనే స్థానిక రాజులు పాలించారని, వీరిలో చివరిరాజు సమగోపను జయించిన సాతవాహనుడు క్రీ.పూ. 80లో, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, అతని కొడుకు శాతకర్ణి క్రీ.పూ. 50లో రాజై కలింగ ఖారవెలుని దాడిని తిప్పి కొట్టాడని, సాతకర్ణి కొడుకు సిముకునితో సాతవాహన రాజ్యం సుస్థిరమైందనీ, సాతవాహనులు ఆంధ్రజాతీయులనీ, వారు మగధ సామ్రాజ్యానికి సామంతులైనందువల్ల ఆంధ్రభృత్యులని పిలువబడినారని, పురావస్తు ఆధారాల సమన్వయంతో శాస్త్రిగారు చేసిన సంచలన ప్రకటనను చరిత్రకారులందరూ బలపరిచారు. అప్పటివరకూ శాతవాహన చరిత్రపై గల అస్పష్టతలకు ఆయన పరిష్కారం చూపించారు.

'ఏబ్రీఫ్ సర్వే ఆఫ్ ది శాతవాహన కాయినేజ్' వ్యాసాన్ని జర్నల్ ఆఫ్ ఆర్కియోలజీ-

5