రాసీ రాసీ చారిత్రక విషయాలను రాబట్టారు. శాసనాలతోపాటు, చరిత్రను కూడా నెమరువేసుకొంటూ, శాసనాల్లోని కొత్త విషయాలను వ్యాసాల ద్వారా ప్రచురించటం మొదలు పెట్టారు. బాల్యంలోనే పంచకావ్యాలు చదివి, సంస్కృతంలో ఎంఏ చేయటాన, సంస్కృత శాసనాలు చదవటం శాస్త్రి గారికి నల్లేరు మీద బండినడకైంది. తెలుగు సాహిత్యంపై పెంచుకొన్న మమకారంతో, తెలుగు శాసనాల్లోని సాహిత్యం శాస్త్రి గారిలో మరింత ఆసక్తిని రగిలించింది. సాహిత్యాభినివేశంతో, 'మేఘసందేశ సమీక్ష - పూర్వార్థము' అన్న వ్యాసాన్ని 1962లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ పత్రికలో రాశారు.
కాకతీయులపై విస్తృత పరిశోధన
శాసనాలను చదవటంలో పట్టు సాధించిన శాస్త్రిగారు, అప్పటి వరకూ కాకతీయులపై జరిగిన పరిశోధనలను బేరీజు వేసి, తరువాత బయల్పడిన శాసనాల ద్వారా, కాకతీయ చరిత్రలోని కొత్త విషయాలను కూడ జోడించి, వారి చరిత్రను మళ్లీ రాయటానికి పూనుకొన్నారు. ఆ సందర్భంగానే, శాస్త్రిగారు మునుపటి ఖమ్మం జిల్లా బయ్యారం చెరువువద్ద గల కాకతి మైలాంబ శాసనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, కాకతీయ వంశ చరిత్రను పునర్నిర్మించి, 1967లో భారతి మాసపత్రికలో 'కాకతి మైలాంబ-బయ్యారం చెరువు శాసనము' అన్న వ్యాసాన్ని రాశారు. తద్వారా కాకతీయులు, రాష్ట్రకూటుల సామంతులుగా, వేంగీపై రాష్ట్రకూటుల దాడిలో పాలుపంచుకొని, కొరవి మండలాధిపతులుగా ఎదిగారని, తరువాత, కళ్యాణ చాళుక్యుల కాలంలో వారి విధేయులై అనుమకొండపురానికి సామంతాధిపతులుగా కొనసాగారని, తరువాత కాలచురిబిజ్జలుడు, కాకతిరుద్రునిపై దాడి చేయగా, రుద్రుడు తిప్పికొట్టి, స్వతంత్రుడై కాకతీయ రాజ్యాన్ని స్థాపించాడని వేయిస్థంభాల గుడి శాసనంలో ప్రకటించుకొన్నాడని రాశారు. అంతవరకూ, కాకతీయరుద్రుడు, కళ్యాణ చాళుక్యులనెదరించి స్వతంత్రుడైనాడన్న అపోహకు తెరదీసి, వారికి విధేయుడుగా ఉంటూనే, కాలచూరి బిజ్జలునికి లొంగక, స్వతంత్రుడైనాడని శాస్త్రిగారు తేటతెల్లం చేశారు.
అంతేకాదు, కాకతిమైలాంబ బయ్యారం చెరువు శిలాశాసనం ద్వారా, వంశాను క్రమణికతోపాటు, కాకతీయ చరిత్రనే తిరగరాశారు. గణపతిదేవుని పాలనా కాలంలో (క్రీ.శ. 1199-1262) అతని చెల్లెలైన మైలాంబ తనపేరు మీదుగా తవ్వించిన ధర్మకీర్తి సముద్రమనే పెద్ద చెరువు స్థాపన సందర్భంగా వేయించిన ఈ శాసనాన్ని పరబ్రహ్మశాస్త్రి గారే 1966లో కనుగొన్నారు.
అలానే, శాస్త్రిగారు కాకతీయ నాణేలపై కూడ విస్తృత పరిశోధనగావించారు. తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి నుంచి తనకు చేరిన కాకతీయ ప్రతాపరుద్రుని రాగిరేకు శాసన కడియంపైన 'దాయగజకేసరి' అన్న ముద్ర ఉంది. దాని అర్థం శతృవులనే
3