Jump to content

పుట:శాసనోపాసన.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రముఖ శాసన పరిశోధకులు

డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి

అప్పటికింకా, కృష్ణానదిపై ఎగువన ఒక్క ఆనకట్ట కట్టలేదు. పైనుంచి వచ్చే నీళ్లన్నీ వరదలా నిరంతరం పారుతూ, విజయవాడైన ఇప్పటి బెజవాడ కొండల్ని దాటి, పొంగుతూ పొర్లుతూ ఉరకలూ, పరుగులతో చుట్టు పక్కల ప్రాంతాన్ని జలమయం చేస్తూ, పున్నమివెన్నెల్లో ఆరబెట్టిన తెల్లటి దుప్పటిని గుర్తు చేస్తుంది కృష్ణమ్మ. కాటన్ దొరకట్టిన ఒక ఆనకట్ట తప్ప, కృష్ణానదికి ఎలాంటి అడ్డుకట్టా లేనందువల్ల ప్రతిఏడూ ఒకటో రెండో వరదలు సరదాగా వచ్చిపోతుండేవి. ఇలా కృష్ణానదికి ఇరువైపులా వరదలతో పరదాలా పరుచుకొన్న నీటివల్ల ఈ ప్రాంతానికి 'వెలనాడు' అని పేరొచ్చిందంటారు. 'ఆఱు' అంటే తమిళంలో నది అని, 'వెల్లం' అంటే వరద అనీ, తరచూ నదికి వరదలొచ్చే ప్రాంతం గాబట్టి 'ఆఱువెల్లంనాడు' రానురాను 'ఆరువేలనాడు' అయిందనీ, తరువాత ఆరువేలగ్రామాలను కలిగిన షట్ సహస్రనాడు అయిందని కొందరు పరిశోధకుల అభిప్రాయం.

నిరంతరం జలజలా పారే నీటితో, పచ్చటి తివాచీ పరచిన ప్రకృతి కాంతఒడిలో, కృష్ణానదికి కుడిగట్టున గుంటూరు జిల్లా, దుగ్గిరాల తాలూకాలో, విజయవాడకు దిగువన పెదకొండూరు అనే గ్రామం అలరారుతూ ఉంది. శివుడు ఆనందేశ్వరుడుగా కొలువై, వైదిక కార్యక్రమాలకు నెలవై, ఒక అగ్రహారంగా పేరుగాంచింది పెదకొండూరు. ఆ గ్రామంలోని ఒక పండిత కుటుంబానికి చెందిన పుచ్చా వెంకటేశ్వర్లు గారికి పరబ్రహ్మశాస్త్రి జన్మించారు.

1