I. వర్ణక్రమసంబంధములు—
1. అనుస్వారస్వరూపమును గుఱించి ముందుగా విచారింతము. అనుస్వారము తెనుఁగులోఁ బూర్ణ మనియు నర్ధ మనియు రెండువిధములు. నిండుసున్న పూర్ణానుస్వారరేఖ. అఱసున్న యర్ధానుస్వారరేఖ. శాసనములందుఁ గాని పూర్వపువ్రాఁతపుస్తకములందుఁ గాని యఱసున్న యెచ్చటను గానరాదు. అది యుండవలసినచోటఁ గూడ నిండుసున్నయే కనఁబడుచున్నది. ప్రాచీనశాసనములలో నిండుసున్నకు బదులు వర్గాంత్యానునాసికాక్షరములు కనఁబడుచున్నవి. అనగా కట్టిఞ్చి, తమ్ముణ్ఢు, అన్త యేనియు, ఫలమ్బు, ఇత్యాదిరూపంబులు కనఁబడుచున్నవి. దీనిని బట్టి చూడంగాఁ దెలుఁగులో ననుస్వార మని వాడఁబడుచున్నది వర్గాంత్యానునాసికాపరరూప మనియు, అది తొలుత ననునాసికాక్షరముగానే వ్రాయఁబడుచుండి కొంతకాల మైనపిదప సౌకర్యార్థము బిందురూపముగా వ్రాయఁబడెననియు, ఆబిందువు తొలుతఁ బూర్ణముగానే యుచ్చరింపఁబడి రాను రాను లాఘవార్ధము దీర్ఘముమీఁద నిత్యముగాను హ్రస్వముమీఁద వైకల్పికము గాను దేల్చి పలుకఁబడసాగె ననియు దీనివలననే పూర్ణార్ధానుస్వారభేద మేర్పడియె ననియుఁ దేలుచున్నది.
2. శాసనములలోఁ గొన్నిచోటుల వ్రాఁత యొకవిధముగాను బలుకుబడి యొకవిధముగాను గనఁబడుచున్నది. ఉదాహరణము:—
(క) రెండవశాసనములో "నెగి దీచ్చెన్ మఠంబు” (2 వ పద్యము) "అశ్వమేధంబు ఫలంబు" (3 వ పద్యము) అనుచోటుల మఠము, ఫలము అని చదువవలయును. లేకున్న ఛందోభంగ మగును. మఠశబ్దమునకు మఠంబు, మఠమ్ము, మఠమునని మూఁడురూపము లున్నవి. అందు మఠంబు అనునదియే మొదటిరూప మయినట్లును అది మాఱి మఠమ్ము అయినట్లును, అది తేలిచి పలుకుటచేత మఠము