Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఆంధ్రదేశమం దచ్చటచ్చట నున్న శిలాశాసనములందలి తెలుఁగుపద్యము లిందుఁ గూర్పఁబడియున్నవి. వీనిలో ననేకములు మాతృకలను బట్టి గాని వాని ప్రతిబింబములను బట్టి గాని నేను స్వయముగాఁ బ్రతివ్రాసినవియే. కొన్ని శాసనము లచ్చటచ్చట నిదివఱలో బ్రకటితములై యున్నవి. ఏయే గ్రంథములందు ముద్రింపఁబడినవో యవి యథాసందర్భముగ సూచించినాఁడను. ఇదివఱకుఁ బ్రకటింపఁబడని శాసనములలో నేవియైన రాజకీయశాసనాధికారవర్గముచే సంభృతములైన శాసనములలోఁ జేరియున్నచో నాశాసనము లాశాసనవర్గమువారు ప్రకటించిన యేయేసంవత్సరపు పట్టికలలో నేయేసంఖ్య గలవిగా నున్నవో యదియు సూచించినాఁడను. ఇందు మొదటిశాసనము 770వ శకసంవత్సరప్రాంతమునందును, చివరిది 1600వ శకసంవత్సరప్రాంతమందును బుట్టిన వగుటచే నెనిమిదివందల సంవత్సరములకంటె నధిక మగుకాలమందుఁ బుట్టినపద్యము లిందుఁ గలఁ వని తేలుచున్నది. వీనిలో మొదటిశాసనము నన్నయభట్టారకుని ప్రభువగు రాజరాజనరేంద్రునికంటె నూటడెబ్బది ఎనిమిది సంవత్సరములు పూర్వము – అనగా శ.స. 766 మొదలుకొని రాజ్యముచేసిన గుణగవిజయాదిత్యుని రాజ్యకాలమునఁ బుట్టినది. దానికి నించుమించుగా నేఁబది సంవత్సరముల పిదప రెండవశాసనము పుట్టినది. కావున నీరెండు శాసనములును వాగనుశాసనకాలముకంటెఁ బూర్వము పుట్టినవే. ఈనాఁటిమండలముల వరుసనుబట్టియే యేయేమండలములలో నెన్నెన్ని శాసనములు దొరికినవో యీ క్రిందిపట్టికవలనఁ దెలియఁదగు. ​

గంజాము ... 1
విశాఖపట్టణము ... 1
గోదావరి ... 11
కృష్ణ ... 17
గుంటూరు ... 52
నెల్లూరు ... 1
కర్నూలు ... 1
కడప ... 2
గోలకొండదేశము ... 2
                           ———
                           88
                           ———

మొత్తము పద్యములలో ముప్పాతికకు మించి కృష్ణాతీరమందు దొరికినవి. పూర్వకాలమందు, కృష్ణాతీరమందుఁ గవులెక్కుడుగా నున్నట్లు దీనివలనఁ దెలియుచున్నది.

ఈపద్యములవలని ప్రయోజనములు రెండువిధములు. దేశచరిత్రము తెలిసికొనుట యొకటి, ఆంధ్రశబ్దలక్షణమును ఛందస్సును గాలక్రమమున నెట్లు మాఱియుండునో యది తెలిసికొనుట యొకటి. భారతాదిప్రాచీనగ్రంథములు కూడ భాషాచరిత్రశోధన కుపయోగించునవియే కాని యవి పుట్టినవి పుట్టిన ట్లిప్పటివారికి లభించుటలేదు. కవులు వ్రాసిన మాతృకలు చిరకాలముక్రిందటనే నశించిపోయి... వానిని బట్టి యాయాకాలమువారు వ్రాసియుంచిన ప్రతులలోఁ జిట్టచివరవియె యప్పుడు దొరుకుచున్నవి. పాండిత్యాభావముచేత నేమి పాండిత్య ముండియుఁ బ్రాచీనప్రయోగములు తప్పు లనుకొని సవరించుటవలన నేమి కేవలప్రమాదముచేత నేమి ప్రతులు వ్రాసినవా రచ్చట్చటఁ బాఠముల దిద్దుచుండిరి. లిఖితప్రతులలోఁ బాఠాంతరములుండుటయే యిందులకు నిదర్శనము. ఇట్లు మారియున్న గ్రంథములం బట్టి కవిప్రయుక్తపాఠముల నిర్ణయించుట శ్రమసాధ్యము. ఈశాసనపద్యము లన్ననో కవులజీవితకాలములో నెట్లు లిఖింపఁబడినవో యట్లే మనకు లభించుటచేఁ గవిప్రయుక్తపాఠనిర్ణయమున కత్యంతప్రబలసాధనములుగా నున్నవి. ఈవిషయములో నేమి యితరవిషయములలో నేమి వీనిప్రామాణ్య మేమాత్రమును జెడకుండుటకై పద్యపాఠములు తూచాలు తప్పకుండ నున్నవి యున్నట్లే ముద్రింపఁబడినవి. ప్రమాదముచే నెక్కడనయిన నొక్కపాఠము తప్పియుండిన నుండునేమో కాని తప్పకుండ నుండవలయుననియే సర్వప్రయత్నములు చేసినారము.

​ఈపద్యములం దయినను గవ్యుద్దిష్టములు కానిపాఠములు కొన్ని ప్రవేశించి యుండఁగూడదా యన్నచోఁ బ్రవేశించి యున్నవని యొప్పుకొనక తప్పదు. లేఖకప్రమాదజనితదుష్టప్రయోగము లనేకము లచ్చటచ్చటఁ గన్పట్టుచున్నవి. ఆపాఠము లున్నవి యున్నట్లే మూలమం దుంచి వానిని సవరించువిధ మాయాపుటలయం దడుగున సూచింపఁబడినది.

ఇవి గాక కవిప్రయుక్తము లనఁదగిన పాఠములలోఁ గూడ వర్ణక్రమమునందును శబ్దలక్షణమందును నిప్పటి సదాచారమునకు విరుద్ధము లయిన ప్రయోగములు కొన్ని కనఁబడుచున్నవి. ఇవి కూడ లేఖకప్రమాదజనితములే కాఁగూడదా యన్న నట్లు కానేర దని చెప్పవలసియున్నది. వివిధకాలముల వివిధప్రదేశములందుఁ బుట్టిన వివిధశాసనము లన్నింటిలో నొక్కవిధముగా నున్న ప్రయోగము లాయాకాలములందు జనసామాన్యసమ్మతము లయినవే గాని యాయాయి లేఖకులు కల్పించినవి కా వని చెప్పక తప్పదు. అట్టి ప్రయోగములలో ముఖ్యమైన వీక్రింద వివరింపఁబడుచున్నవి. వీనిలో I. వర్ణక్రమమునకు సంబంధించినవి కొన్ని, II. శబ్దలక్షణమునకు సంబంధించినవి కొన్ని—