34
వ్రత రత్నాకరము
తా. మునులందఱికి ఉనికిపట్టయిన రమ్యమైన కైలాస పర్వత శిఖరంబున నవరత్నములచేఁ జెక్కఁబడిన కల్పవృక్షము క్రింద బంగారు సింహాసనముమీఁద లోకులకు మేలుచేయునట్టియీశ్వరుఁడు కూర్చుండియుండఁగా కుమారస్వామి జనులకు మేలుచేయగోరినవాఁడై , తండ్రినిఁ జూచి యోభగవంతుడా! మానవుండేవ్రతము నాచరించినయెడల నతనికి సాటి లేని సంపదలు గలుగును? పుత్త్ర పౌత్త్రులును, ధనమును గలవాఁడై మనుష్యుఁడు సుఖముకలిగి యుండును? ఓమహాదేవా! నాకిట్టివ్రతములలో నుత్తమోత్తమమయిన యొక వ్రతంబు ననుగ్రహింపుము” అని యడుగఁగా, శివుఁడును తన కుమారునిఁ జూచి యిట్లనియె.
కుమారా! సకలసంపదలను, దీర్ఘాయుస్సును, కోరినకోరికలను, పశులను నొసఁగునట్టి గణపతి పూజనమనెడి యొక వ్రతంబు గలదు. ఆవ్రతమును భాద్రపదశుక్లచతుర్థినాఁ డాచరింపవలెను. ఆదినమున ఉదయమున లేచి స్నానము జేసి పరిశుద్ధుఁడై సంధ్యావందనము మొదలగు నిత్యకర్మములను జేసికొని , తనశక్తికిఁ దగినట్లు ద్రవ్యలోపము చేయక వెండితో గాని, బంగారుతో గాని, తుదకు మంటితోఁగాని వినాయకుని ప్రతిమను జేసికొని తనయింటియొక్క యుత్తరపువైపున నొకపాలపల్లి నేర్పఱచి, దానినడుమ నెనిమిదిదళములుగలకమలమును యవలతో గాని బియ్యపుఁబిండితోగాని నిర్మించి, యచ్చట నాప్రతిమను బెట్టి భ క్తిపూర్వకముగా తెల్లనిగంధముతోను అక్షతలతోను పూవులతోను గరికపోచలతోను యిరువది యొక పత్రములతోను పూజచేసి, ధూపదీపములను సమర్పించి నేతితో వండినకుడుములు, ఇరువదియొక టేసివంతున టెంకాయలు, ఇంకను ఆరఁటిపండ్లు, నేరేడిపండ్లు, వెలఁగపండ్లు,